న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు) 2008-09, 2012-13 మధ్యకాలంలో చేసిన రూ.5.50 లక్షల కోట్ల పెట్టుబడుల్లో దాదాపు సగం ఐదు రాష్ట్రాలకే వెళ్లాయి. వీటిలో 20 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా 8.4 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో నిలిచిందని అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. తమిళనాడు 8.1, ఒడిశా 6.7, ఉత్తర్‌ప్రదేశ్ 6.2 శాతం వాటాలతో తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. సీపీఎస్‌ఈ పెట్టుబడులను తక్కువగా ఆకర్షించిన రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక, హర్యానా వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలూ ఉండడం విశేషం.
బీహార్ 3.2, గుజరాత్ 2.8, కర్ణాటక 2.5, జార్ఖండ్ 1.9, కేరళ 1.5, రాజస్థాన్ 1.1, పంజాబ్ 0.7, హర్యానా 0.6 శాతం వాటాలను ఆకర్షించాయి. కొత్త ప్రాజెక్టుల అమలులో జాప్యాలు లేనట్లయితే మరిన్ని పెట్టుబడులు వచ్చేవనీ, ఉద్యోగావకాశాలు పెరిగేవనీ అసోచామ్ విశ్లేషించింది. 2013 జూన్ నాటికి దేశంలో 582 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిలో 311 ప్రాజెక్టుల నిర్మాణం అప్పటికే నెల నుంచి 20 ఏళ్లవరకు ఆలస్యమైందని అసోచామ్ నివేదిక పేర్కొంది. 2011-12లో మొత్తం రూ.98 వేల కోట్లుగా ఉన్న 229 సీపీఎస్‌ఈల నికరలాభం తర్వాతి ఏడాదిలో రూ.1.15 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.
ప్రభుత్వ సంస్థల పెట్టుబడుల్లో సగం ఐదు రాష్ట్రాలకే
Published Mon, Sep 8 2014 1:04 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement