
స్కూలు బ్యాగ్ లతో సమస్యలే..
కోల్ కతాః కేజీలకొద్దీ బరువున్న పుస్తకాలను బ్యాగుల్లో మోయడంవల్ల పాఠశాల వయసు విద్యార్థుల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తాజా సర్వేలు చెప్తున్నాయి. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోఛెమ్), తన హెల్గ్ కేర్ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది.
భారతదేశంలోని 13 ఏళ్ళ వయసులోపు 68 శాతం మంది విద్యార్థులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడటమే కాక, కొన్నాళ్ళకు గూని సమస్య కూడా వస్తున్నట్లు అసోఛెమ్ నిర్వహించిన సర్వే ద్వారా కనుగొన్నారు. 7 నుంచి 13 ఏళ్ళ వయసు పిల్లలపై నిర్వహించిన సర్వేలో.. వారు మోసే బరువులో 45 శాతం పుస్తకాలు, క్రికెట్ కిట్ లు, స్విమ్ బ్యాగ్ లు, ఆర్ట్ కిట్ లు రూపంలో వారి వెన్నుపై పడటంతో వెన్ను దెబ్బతినడంతోపాటు, తీవ్రమైన నడుం నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుసుకున్నారు. విద్యార్థి దశలో ఎక్కువగా బరువులు మోయడంతో ఎర్లీస్లిప్ డిస్క్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్, పెర్సిస్టెంట్ బ్యాక్ ఏక్ వంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు అసోఛెమ్ హెల్త్ కమిటి ఛైర్మన్ బి.కె. రావు తెలిపారు.
పిల్లల స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2006 ప్రకారం విద్యార్థి బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదు. అంతేకాక నర్సరీ, కిన్నర్ గార్డెన్ చదివే పిల్లలు అసలు స్కూల్ బ్యాగే ధరించకూడదని ఈ చట్టం చెప్తోంది. దీనిపై పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పాఠశాలల్లో పిల్లలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాకర్స్ సౌకర్యం కూడ ఏర్పాటు చేయాలి. అయితే ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని, దీంతో పిల్లల్లో నడుం నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు తీవ్రమవ్వడమే కాక, అధిక బరువు ప్రభావం పిల్లల పెరుగుదలపై కూడ పడుతోందని రావ్ తెలిపారు. భారీ బరువుతో కూడిన బ్యాక్ ప్యాక్ లు వేసుకొని ఎక్కువ దూరం నడవటం వెన్ను నొప్పికి కాకణమవ్వడంతో పాటు, బరువును మధ్య మధ్యలో కిందికి దింపి మళ్ళీ ఎత్తుకుంటుండటం మరీ ప్రమాదమని రావు చెప్తున్నారు.
అధిక బరువు కండరాలు, అస్థిపంజరాలు, డిస్క్ లపై తీవ్ర ప్రభావం చూపి, అవి దెబ్బతినేలా చేస్తుందని కొంత కాలానికి గూని సమస్య కూడ వచ్చే అవకాశం ఉందని బి.కె.రావు తెలిపారు. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూనె, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, డెహ్రాడూన్ వంటి భారత్ లోని పది నగరాల్లో 2500 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించడంతోపాటు, 1000 మంది తల్లిదండ్రులను సైతం అసోఛెమ్ ఇంటర్వ్యూ చేసింది. ప్రతిరోజూ 20 నుంచి 22 టెక్ట్స్ పుస్తకాలు, ఏడెనిమిది వరకూ నోట్ పుస్తకాలతోపాటు రోజు విడిచి రోజు స్కేట్లు, టేక్వోండో పరికరాలు, స్విమ్ బ్యాగ్, క్రికెట్ కిట్ వంటివి కూడా స్కూలుకు తీసుకెళ్ళాల్సి వస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అతి తక్కువ పాఠశాలలు స్పోర్ట్స్ కిట్స్ కోసం లాకర్లను ఇస్తున్నట్లు వారు తెలిపారు.