రూపాయి పతనం, మందగమనం కంపెనీల ప్రకటనల వ్యయాలపైనా ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి.
న్యూఢిల్లీ: రూపాయి పతనం, మందగమనం కంపెనీల ప్రకటనల వ్యయాలపైనా ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. కంపెనీలు ఈ పండుగ సీజన్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులను సగానికి సగం తగ్గించుకోనున్నాయి. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రూపాయి క్షీణత వల్ల ఈసారి అక్టోబర్-డిసెంబర్ మధ్య పండుగ నెలల్లో కంపెనీలు.. ప్రింట్, టీవీ, రేడియో ప్రకటనల వ్యయాలను 50 శాతం పైగా తగ్గించుకోనున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. దీపావళి సీజన్‌లో ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూర బుల్స్ సంస్థలైతే ఏకంగా 65 శాతం కోత విధించనున్నాయని వివరించారు. మందగమనం కారణంగా కన్జూమర్ డ్యూరబుల్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, ఎఫ్‌ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా దెబ్బతిన్నాయని సర్వే పేర్కొంది. ఈ రంగాల సంస్థల మార్జిన్లు భారీగా పడిపోయాయని వివరించింది. దీంతో ఇవి బ్రాండ్ ప్రమోషన్‌పై వ్యయాలను తగ్గించుకుంటున్నాయని పేర్కొంది.
బ్యాంకులు, టెల్కోలు కూడా..
దేశీయంగా అత్యధిక స్థాయిలో ప్రకటనలు ఇచ్చే బ్యాంకింగ్, టెలి కం, ఆర్థిక సర్వీసులు, బీమా రంగాల సంస్థలు సైతం ఈసారి యాడ్ బడ్జెట్ లో కోత విధిస్తున్నాయి. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేం దుకు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. కూపన్లు, పాయింట్ ఆఫ్ సేల్ డిస్కౌంట్ ఆఫర్లు వంటి ప్రయోగాలతో ఊదరగొట్టాలని భావిస్తున్నాయి.
యాడ్ రేట్లు తగ్గిస్తున్న మీడియా..
ఈ పరిణామాలు టీవీ, రేడియో సంస్థలకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో కార్పొరేట్ల నుంచి ప్రకటనలను పొందేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రకటనల రేట్లను తగ్గించడంతో పాటు భారీ డిస్కౌంట్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయని సర్వే వెల్లడించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, చండీగఢ్ వంటి నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో సుమారు 1,200 మధ్య స్థాయి, పెద్ద స్థాయి కంపెనీలు పాల్గొన్నాయి.