ds rawat
-
డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయఢంకా
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయకేతనం ఎగురవేసింది. శనివారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను కైవసం చేసుకుంది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తనతో పోటీపడిన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) కంటే అత్యుత్తమ ఫలితాలను సాధించింది. ఏబీవీపీ తరఫున బరిలోకి దిగిన మోహిత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ మాలిక్, కార్యదర్శిగా కనికా షెకావత్, సంయుక్త కార్యదర్శిగా అశుతోశ్ మాధుర్‌లు ఎన్నికయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రధాన ఎన్నికల అధికారి డీఎస్ రావత్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏబీవీపీ అభ్యర్థి మోహిత్‌కు మొత్తం 20,178 ఓట్లు వచ్చాయని, ఇక ఎన్ఎస్యూఐ తరఫున బరిలోకి దిగిన గౌరవ్ తుషిర్కు 19,804 ఓట్లు దక్కాయని అన్నారు. 914 ఓట్ల తేడాతో గౌరవ్ పరాజయం పాలయ్యాడన్నారు. మాట నిలబెట్టుకున్నాం: రోహిత్ విద్యార్థులకు ఇచ్చిన వాగ్దాలన్నింటినీ తాము నెరవేర్చామని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చహల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టిన తర్వాత అందరిలోనూ ఆశలు, ఆకాంక్షలు బాగా పెరిగిపోయాయన్నారు. నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేయించిన ఘనత తమదేనన్నారు. మోడీ సునామీ కారణంగా తాము విజయం సాధిం చగలిగామని అన్నారు. మోడీ ప్రభావమే: సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ విజయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోడీ ప్రభావమేనని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఏబీవీపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులంతా అనూహ్య రీతిలో ఏబీవీపీకి మద్దతు పలికారని పేర్కొన్నారు. ట్విటర్లో షా అభినందనలు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో ఏబీవీపీ విజయాన్ని సాధించినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభినందనలు తెలిపారు. నాలుగు పదవులను దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఈ గొప్పదనం విద్యార్థులు, కార్యకర్తలదేనన్నారు. నాలుగు ప్యానళ్లలోనూ విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. జాతీయ రాజధానితోపాటు దేశంలోని యువత అంతా బీజేపీ విధానాలను సమర్థిస్తున్నారనడానికి ఇదొక చిహ్నమన్నారు. యువతే ఈ దేశానికి భవితగా అభివర్ణించారు. వారితోటే శ్రేష్ట భారత్, ఏక్ భారత్ సాకారమవుతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రచారానికి డూసూ రేడియో సిద్ధం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ రేడియోను ప్రచారం నిమిత్తం విద్యార్థి సంఘాలు వాడుకోవచ్చని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను సైతం కలుసుకోవాల్సి ఉంది. అయితే వీరు ఆయా కళాశాలలకు వెళ్లి విద్యార్థులందరినీ ముఖాముఖి కలిసేందుకు ఉన్న అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు రేడియో ద్వారా విద్యార్థులకు చేరువయ్యేందుకు అనుమతిస్తున్నట్లు డూసూ ప్రధాన ఎన్నికల కమిషనర్ డీఎస్ రావత్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కమ్యూనిటీ రేడియో 90.4 ఎంహెచ్‌జెడ్‌ను అభ్యర్థులు తమ ప్రచారానికి వాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 5 నిమిషాలు సమయం ఇస్తామని చెప్పారు. ముఖ్య ఎన్నికల అధికారి, ముఖ్య రిటర్నింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీకి సదరు అభ్యర్థుల ప్రసంగాలను ఎడిట్ చేసే హక్కు ఉంటుందన్నారు. కాగా రేడియో ద్వారా తమ ప్రసంగాన్ని వర్సిటీ విద్యార్థులందరికీ వినిపించడం అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కమ్యూనిటీ రేడియో ద్వారా తమ ప్రసంగం వినిపించడానికి అభ్యర్థులకు కేటాయించిన 5 నిమిషాల సమయం చాలా తక్కువని ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అభిప్రాయపడ్డారు. ‘అభ్యర్థులు వర్సిటీ అనుబంధ కళాశాలన్నింటికీ వెళ్లి విద్యార్థులను కలిసి ప్రచారం చేయడం కొంత కష్టంతో కూడుకున్న పనే.. అలాగే ప్రైవేట్ ఎఫ్ఎం చానళ్ల ద్వారా ప్రచారానికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు.. ఇటువంటి సమయంలో కమ్యూనిటీ ఎఫ్ఎం ద్వారా అభ్యర్థులకు ప్రచారానికి అవకాశం కల్పించడం మంచిదే..’ అని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చహల్ అన్నారు. ఇదిలా ఉండగా, అభ్యర్థులనుంచి వచ్చే అభ్యర్థనలబట్టి వారికి కేటాయించే సమయంలో కొంత మార్పులుచేర్పులు చేసే అవకాశముందని సీఈవో స్పష్టం చేశారు. కాగా, కమ్యూనిటీ రేడియో 2007లో ప్రారంభమైంది. విద్యార్థి సంఘాల ఎన్నికల ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. డూసూ నామినేషన్లు పూర్తి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డూసూ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో పూర్తయినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డి.ఎస్.రావత్ తెలిపారు. నాలుగు పదవులకు గాను మొత్తం 144 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో అధ్యక్ష పదవికి 37, ఉపాధ్యక్ష పదవికి 32 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని రావత్ తెలిపారు. అలాగే కార్యదర్శికి 41, సంయుక్త కార్యదర్శి పదవికి 34 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని చెప్పారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని రావత్ తెలిపారు. -
పండుగ వేళ ప్రకటనలకు మాంద్యం
న్యూఢిల్లీ: రూపాయి పతనం, మందగమనం కంపెనీల ప్రకటనల వ్యయాలపైనా ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. కంపెనీలు ఈ పండుగ సీజన్లో అడ్వర్టైజ్మెంట్ ఖర్చులను సగానికి సగం తగ్గించుకోనున్నాయి. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రూపాయి క్షీణత వల్ల ఈసారి అక్టోబర్-డిసెంబర్ మధ్య పండుగ నెలల్లో కంపెనీలు.. ప్రింట్, టీవీ, రేడియో ప్రకటనల వ్యయాలను 50 శాతం పైగా తగ్గించుకోనున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. దీపావళి సీజన్లో ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూర బుల్స్ సంస్థలైతే ఏకంగా 65 శాతం కోత విధించనున్నాయని వివరించారు. మందగమనం కారణంగా కన్జూమర్ డ్యూరబుల్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా దెబ్బతిన్నాయని సర్వే పేర్కొంది. ఈ రంగాల సంస్థల మార్జిన్లు భారీగా పడిపోయాయని వివరించింది. దీంతో ఇవి బ్రాండ్ ప్రమోషన్‌పై వ్యయాలను తగ్గించుకుంటున్నాయని పేర్కొంది. బ్యాంకులు, టెల్కోలు కూడా.. దేశీయంగా అత్యధిక స్థాయిలో ప్రకటనలు ఇచ్చే బ్యాంకింగ్, టెలి కం, ఆర్థిక సర్వీసులు, బీమా రంగాల సంస్థలు సైతం ఈసారి యాడ్ బడ్జెట్ లో కోత విధిస్తున్నాయి. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేం దుకు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. కూపన్లు, పాయింట్ ఆఫ్ సేల్ డిస్కౌంట్ ఆఫర్లు వంటి ప్రయోగాలతో ఊదరగొట్టాలని భావిస్తున్నాయి. యాడ్ రేట్లు తగ్గిస్తున్న మీడియా.. ఈ పరిణామాలు టీవీ, రేడియో సంస్థలకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో కార్పొరేట్ల నుంచి ప్రకటనలను పొందేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రకటనల రేట్లను తగ్గించడంతో పాటు భారీ డిస్కౌంట్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయని సర్వే వెల్లడించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, చండీగఢ్ వంటి నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో సుమారు 1,200 మధ్య స్థాయి, పెద్ద స్థాయి కంపెనీలు పాల్గొన్నాయి.