న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయకేతనం ఎగురవేసింది. శనివారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను కైవసం చేసుకుంది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తనతో పోటీపడిన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) కంటే అత్యుత్తమ ఫలితాలను సాధించింది. ఏబీవీపీ తరఫున బరిలోకి దిగిన మోహిత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ మాలిక్, కార్యదర్శిగా కనికా షెకావత్, సంయుక్త కార్యదర్శిగా అశుతోశ్ మాధుర్‌లు ఎన్నికయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రధాన ఎన్నికల అధికారి డీఎస్ రావత్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏబీవీపీ అభ్యర్థి మోహిత్‌కు మొత్తం 20,178 ఓట్లు వచ్చాయని, ఇక ఎన్‌ఎస్‌యూఐ తరఫున బరిలోకి దిగిన గౌరవ్ తుషిర్‌కు 19,804 ఓట్లు దక్కాయని అన్నారు. 914 ఓట్ల తేడాతో గౌరవ్ పరాజయం పాలయ్యాడన్నారు.
మాట నిలబెట్టుకున్నాం: రోహిత్
విద్యార్థులకు ఇచ్చిన వాగ్దాలన్నింటినీ తాము నెరవేర్చామని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చహల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టిన తర్వాత అందరిలోనూ ఆశలు, ఆకాంక్షలు బాగా పెరిగిపోయాయన్నారు. నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేయించిన ఘనత తమదేనన్నారు. మోడీ సునామీ కారణంగా తాము విజయం సాధిం చగలిగామని అన్నారు.
మోడీ ప్రభావమే: సతీష్ ఉపాధ్యాయ
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ విజయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోడీ ప్రభావమేనని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఏబీవీపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులంతా అనూహ్య రీతిలో ఏబీవీపీకి మద్దతు పలికారని పేర్కొన్నారు.
ట్విటర్‌లో షా అభినందనలు
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో ఏబీవీపీ విజయాన్ని సాధించినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభినందనలు తెలిపారు. నాలుగు పదవులను దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఈ గొప్పదనం విద్యార్థులు, కార్యకర్తలదేనన్నారు. నాలుగు ప్యానళ్లలోనూ విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. జాతీయ రాజధానితోపాటు దేశంలోని యువత అంతా బీజేపీ విధానాలను సమర్థిస్తున్నారనడానికి ఇదొక చిహ్నమన్నారు. యువతే ఈ దేశానికి భవితగా అభివర్ణించారు. వారితోటే శ్రేష్ట భారత్, ఏక్ భారత్ సాకారమవుతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయఢంకా
Published Sat, Sep 13 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement