న్యూఢిల్లీ: యూనివర్సిటీ రేడియోను ప్రచారం నిమిత్తం విద్యార్థి సంఘాలు వాడుకోవచ్చని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను సైతం కలుసుకోవాల్సి ఉంది. అయితే వీరు ఆయా కళాశాలలకు వెళ్లి విద్యార్థులందరినీ ముఖాముఖి కలిసేందుకు ఉన్న అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు రేడియో ద్వారా విద్యార్థులకు చేరువయ్యేందుకు అనుమతిస్తున్నట్లు డూసూ ప్రధాన ఎన్నికల కమిషనర్ డీఎస్ రావత్ తెలిపారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కమ్యూనిటీ రేడియో 90.4 ఎంహెచ్‌జెడ్‌ను అభ్యర్థులు తమ ప్రచారానికి వాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 5 నిమిషాలు సమయం ఇస్తామని చెప్పారు. ముఖ్య ఎన్నికల అధికారి, ముఖ్య రిటర్నింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీకి సదరు అభ్యర్థుల ప్రసంగాలను ఎడిట్ చేసే హక్కు ఉంటుందన్నారు. కాగా రేడియో ద్వారా తమ ప్రసంగాన్ని వర్సిటీ విద్యార్థులందరికీ వినిపించడం అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కమ్యూనిటీ రేడియో ద్వారా తమ ప్రసంగం వినిపించడానికి అభ్యర్థులకు కేటాయించిన 5 నిమిషాల సమయం చాలా తక్కువని ఎన్‌ఎస్‌యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అభిప్రాయపడ్డారు.
‘అభ్యర్థులు వర్సిటీ అనుబంధ కళాశాలన్నింటికీ వెళ్లి విద్యార్థులను కలిసి ప్రచారం చేయడం కొంత కష్టంతో కూడుకున్న పనే.. అలాగే ప్రైవేట్ ఎఫ్‌ఎం చానళ్ల ద్వారా ప్రచారానికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు.. ఇటువంటి సమయంలో కమ్యూనిటీ ఎఫ్‌ఎం ద్వారా అభ్యర్థులకు ప్రచారానికి అవకాశం కల్పించడం మంచిదే..’ అని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చహల్ అన్నారు. ఇదిలా ఉండగా, అభ్యర్థులనుంచి వచ్చే అభ్యర్థనలబట్టి వారికి కేటాయించే సమయంలో కొంత మార్పులుచేర్పులు చేసే అవకాశముందని సీఈవో స్పష్టం చేశారు. కాగా, కమ్యూనిటీ రేడియో 2007లో ప్రారంభమైంది. విద్యార్థి సంఘాల ఎన్నికల ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.
డూసూ నామినేషన్లు పూర్తి
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డూసూ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో పూర్తయినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డి.ఎస్.రావత్ తెలిపారు. నాలుగు పదవులకు గాను మొత్తం 144 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో అధ్యక్ష పదవికి 37, ఉపాధ్యక్ష పదవికి 32 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని రావత్ తెలిపారు. అలాగే కార్యదర్శికి 41, సంయుక్త కార్యదర్శి పదవికి 34 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని చెప్పారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని రావత్ తెలిపారు.
ప్రచారానికి డూసూ రేడియో సిద్ధం
Published Wed, Sep 3 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement