
అతి జాగ్రత్తవల్లే ప్రాజెక్టుల నత్తనడక
మోదీ సర్కారు పాలనపై అసోచామ్ నివేదిక
న్యూఢిల్లీ : రోడ్లు, పోర్టులు, విద్యుత్ రంగంలో పలు కీలకమైన ప్రాజెక్టుల జాప్యానికి మోదీ సర్కారు అనుసరిస్తున్న అతి జాగ్రత్త విధానమే కారణమని పారిశ్రామిక మండలి అసోచామ్ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అవితీనికి దూరంగా ఉందని, అయితే ఇదే సమయంలో ప్రభుత్వాధికారులు, బ్యాంకర్లు, పీఎస్‌యూ అధికారులపై పటిష్టమైన పర్యవేక్షణ కారణంగా వాళ్లు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ అతిజాగ్రత్తతో ముఖ్యమైన మౌలిక ప్రాజెక్టుల అమలుకు అడ్డంకులు నెలకొంటున్నాయని అసోచామ్ అభిప్రాయపడింది.
ఉదాహరణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పర్యావరణ అనుమతుల్లో జాప్యం కారణంగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్-ఢిల్లీ) పరిధిలో వేలాది పూర్తయిన ఇళ్లకు మోక్షం లభించడం లేదని నివేదిక తెలిపింది. దీంతో రియల్లీ డెవలపర్లు ఆ ఇళ్లను కొనుగోలుదార్లకు అప్పగించడానికి వీల్లేకుండా పోతోందని.. ఈ జాప్యంవల్ల తీవ్ర ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతోందని పేర్కొంది. ప్రాజెక్టుల అమలు స్థాయిలో అధికారులు తమకెందుకులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని..
పూర్తిగా నిబంధనల ప్రకారమే నడుచుకోవడంతోపాటు తమ విచక్షణాధికారాలను ఉపయోగించుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నట్లు అసోచామ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా జాతీయ రహదారుల విషయంలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. మొండిబకాయిలు పెరిగిపోతుండటంతో బ్యాంకర్లపై కూడా ఒత్తిడి అధికమవుతోందని.. ఫలితాంగా కొత్త, తాజా ప్రాజెక్టు ప్రతిపాదనలవైపే బ్యాంకులు మొగ్గుచూపుతున్నట్లు కూడా అసోచామ్ వెల్లడించింది.
డీల్స్
► ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా మొబైల్ అప్లికేషన్ రంగంలో ఉన్న లెట్స్‌గోమొ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించిందీ వెల్లడి కాలేదు.
► ఆన్‌లైన్ హోమ్ డెకార్ స్టోర్ ‘బెడ్‌బాత్ మోర్‌డాట్‌కామ్’ తాజాగా గ్రాఫిక్ ఆర్ట్స్ సంస్థ ‘క్రూడ్ ఏరియా’ను కొనుగోలు చేసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగిన ఈ డీల్ కోసం ఎంత వెచ్చించినదీ కంపెనీ వెల్లడించలేదు.
► అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. డీల్ పూర్తిగా షేర్ల రూపంలోనే జరిగింది. డీల్ విలువ 2.3 బిలియన్ డాలర్లు.
► ఔషధాల పరిశోధనకు సంబంధించి జీవికే బయోతో కలసి పనిచేయడానికి స్వీడన్‌కు చెందిన ఫార్మా స్యూటికల్ కంపెనీ మెడ్విర్ ముందుకొచ్చింది. ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే వ్యాధులు, క్యాన్సర్ చికిత్స పరిశోధనలో మెడ్విర్‌కి మంచి పట్టుంది.
► ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సేవల పోర్టల్ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్‌లో మీడియా దిగ్గజం న్యూస్‌కార్ప్ తన వాటాలను మరో 5 శాతం పెంచుకుంది. దీంతో మొత్తం వాటా 30 శాతానికి చేరింది.
► ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్ మాతృసంస్థ ఎలరా టెక్నాలజీస్‌లో న్యూస్‌కార్ప్ వాటాలను పెంచుకోవడం ఇది సాధ్యపడింది.