‘జింక్’లో మైనారిటీ వాటాతో ప్రయోజనం లేదు..
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వం మైనారిటీ వాటా (29.54 శాతం) కొనసాగించేందుకు తగిన కారణం ఏదీ కనిపించడం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కీలక వ్యాఖ్య చేశారు. ‘హెచ్‌జెడ్‌ఎల్‌లో మెజారిటీ వాటా ప్రైవేటు కంపెనీకి ఇచ్చేసిన తర్వాత ఆ కంపెనీలో ప్రభుత్వానికి ఇక ఎటువంటి వ్యూహాత్మక ప్రయోజనం లేదు. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం తనకున్న మైనారిటీ వాటా కొనసాగించేందుకు ఎటువంటి వాస్తవిక కారణం కనిపించడం లేదు’ అని గోయెల్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
వాటా విక్రయంపై స్పందిస్తూ... చట్టపరమైన అవసరాలుంటే వాటిని నెరవేరుస్తామని తుది నిర్ణయం మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ విభాగం చేతిలోనే ఉందన్నారు. కాగా, హెచ్‌జెడ్‌ఎల్‌లో వాటా విక్రయానికి అంత తొందరేమిటంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 2002లో కేంద్ర ప్రభుత్వం హెచ్‌జెడ్‌ఎల్‌లో 26 శాతం వాటాను రూ.445 కోట్లకు వేదాంత గ్రూప్‌నకు విక్రయించింది. ఆ తర్వాత వేదాంత మరో 20 శాతం సాధారణ వాటాదారుల నుంచి కొనుగోలు చేసింది. 2003లో కాల్ ఆప్షన్ ద్వారా మరో 18.92 శాతం వాటాను కూడా కొనుగోలు చేసింది. ఇంకా 29.54 శాతం వాటా కేంద్రం చేతిలో ఉంది.