Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు | Lok Sabha elections 2024: Cabinet approves 4percent hike in DA for Central government employees | Sakshi
Sakshi News home page

Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు

Published Fri, Mar 8 2024 6:02 AM | Last Updated on Fri, Mar 8 2024 6:02 AM

Lok Sabha elections 2024: Cabinet approves 4percent hike in DA for Central government employees - Sakshi

పెన్షనర్లకు సైతం డీఆర్‌ మరో 4 శాతం 

50 శాతానికి చేరిన డీఏ, డీఆర్‌

న్యూఢిల్లీ:  లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్‌) బేసిక్‌ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్‌ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది.

ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్‌) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్‌ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్‌ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది.   

ఉజ్వల రాయితీ గడువు పెంపు  
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్‌ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది.  

ముడి జనపనారకు మరో రూ.285   
ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్‌ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది.

రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’  
ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్‌ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది.  

రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ
ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్‌ కంప్యూటింగ్‌ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement