సాక్షి, న్యూఢిల్లీ: వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్స్)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్ (మేన్–మేడ్ ఫైబర్) దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్‌ఐ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది.
ఉపాధి, వాణిజ్య అవకాశాల మెరుగుదల
ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పత్తి, సహజ ఫైబర్ ఆధారిత వస్త్ర పరిశ్రమలో కొత్తగా ఉపాధి, వాణిజ్య అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దోహదపడనుంది. కొన్ని నిర్దిష్ట జిల్లాలతోపాటు, టైర్–3, టైర్– 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. వస్త్ర పరిశ్రమకు పీఎల్‌ఐ స్కీమ్ వర్తింపు వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంనది వివరించింది. ఐదేళ్లలో ఈ స్కీమ్ వల్ల రూ. 19,000 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. రూ. 3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రత్యేకించి ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని వివరించింది.
ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్‌కు మెరుపు
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమలో కీలక పరిణామం. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్ భారత తయారీ సామర్థ్యం పటిష్టతకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్, దారం సరఫరాలను భారత్ కలిగి ఉంది. అయితే అయితే నాణ్యమైన ఎంఎంఎఫ్ వస్త్ర ఉత్పత్తి తగినంతగా లేదు. ఈ సమస్యను అధిగమించడానికి తాజా కేబినెట్ నిర్ణయం సహాయపడుతుంది. భారత్ మొత్తం వస్త్ర ఉత్పత్తిలో ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తుల వాటా 20 శాతం మాత్రమే. ఈ నిర్ణయం వల్ల ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తులు ఇకపై ప్రతి ఏడాదీ పెరుగుతాయి. వచ్చే మూడేళ్లలో వస్త్ర ఎగుమతులూ రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి.
– ఏ శక్తివేల్, ఏఈపీసీ చైర్మన్
టెక్స్‌టైల్స్‌కు ‘పీఎల్‌ఐ’ బూస్ట్!
Published Thu, Sep 9 2021 2:26 AM | Last Updated on Thu, Sep 9 2021 8:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment