
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ సారి సెషన్‌లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment