Prahalad Joshi
-
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
ప్రశ్నోత్తరాలు లేకుండానే పార్లమెంటు ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరెన్నో రకాలుగా కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. సెపె్టంబర్ 18–22 మధ్య ఐదు రోజుల పాటు వాటిని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషీ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఉభయ సభల్లో సాధారణంగా ఉదయాన్నే చేపట్టే ప్రశ్నోత్తరాలు ఈ సమావేశాల్లో ఉండబోవు. అలాగే ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వబోరు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు శనివారం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘17వ లోక్‌సభ 13వ సమావేశాలు సెపె్టంబర్ 18 సోమవారం మొదలవుతాయి. ఉభయ సభలు సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది‘ అని లోక్‌సభ సచివాలయం; ‘రాజ్యసభ 261వ సమావేశాలు మొదలవుతాయి‘ అని రాజ్యసభ సచివాలయం వేర్వేరు బులెటిన్లలో పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉంచడం తెలిసిందే. ప్రత్యేక భేటీ కొత్త భవనంలో...? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత లోక్‌సభకు చివరివి అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ఉభయ సభలు సభ్యులకు ప్రత్యేక గ్రూప్ ఫోటో సెషన్‌కు ఏర్పాట్లు జరుగుతుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఈ సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశముందని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి కొత్త భవనంలో జరిగే తొలి సమావేశాలు గనుక ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తుండవచ్చని కూడా కొందరు అంటున్నారు. అత్యాధునిక రీతిలో సర్వ హంగులతో రికార్డు సమయంలో నిర్మితమైన పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత మే 28న ప్రారంభించడం తెలిసిందే. ప్రత్యేక సమావేశాలు ఇలా... ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రోవిజనల్ కేలండర్‌ను ఎంపీలకు విడిగా తెలియజేస్తారు. -
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతల వల్లే జనాభా పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు. -
నిర్మలా సీతారామన్ ధరించిన చీర.. ఎవరు బహుమతి ఇచ్చారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌తో పాటు ఆమె ధరించిన చీరపై కూడా అందరి దృష్టి పడింది. ఎందుకంటే 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఈ ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడల్లా ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత చీరలతో దర్శమిస్తున్నారు. ఈ ఏడాది చేతితో నేసిన ఇక్కత్ సిల్క్ ఎర్ర చీరను ధరించి ఆమె పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఇది భారతీయ సాంప్రదాయ వస్త్రాల పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 2023 సమావేశానికి నిర్మలా సీతారామన్ చేతితో నేసిన నవలగుండ ఎంబ్రాయిడరీ ఎరుపు రంగు ఇక్కత్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఈ చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే నిర్మలమ్మ దగ్గర చీరల కలెక్షన్లు ఎక్కువే! ఆమెకు చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక చీరతో దర్శమమిస్తారు. అదే క్రమంలో నలుపును దూరం పెడుతుంటారు. -
Union Budget 2023: ‘ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్’
పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 2023-24 "ఇది ఉత్తమ బడ్జెట్. ఇది పేద, మధ్యతరగతి అనుకూల బడ్జెట్." అని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. మరో వైపు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. -
అలాంటప్పుడు విదేశాల్లో ఎందుకు చదువుతున్నారు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జోషి మాట్లాడుతూ.. విదేశాల్లో మెడిసిన్ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60 శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్లకు వెళ్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనాలో విద్యను అభ్యసించేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, విదేశాల్లో మెడిసిన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలు పాస్ అయితేనే వారికి భారత్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉండగా మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. దేశంలో మెడికల్ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. నీట్లో తాము అర్హత సాధించినప్పటికీ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో తామకు నష్టం జరుగుతోందన్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్ చదివిన డాక్డర్లు మాత్రం ఉండి ఉంటే దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పత్రిపక్ష నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. -
పార్లమెంట్ సమావేశాలు పొడగింపు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఆగస్టు 7వరకు పొడగిస్తున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కీలకమైన పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నందునే సమావేశాలను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. బిల్లులపై ఓటింగ్ జరగాల్సిన నేపథ్యంలో సమావేశాలను పొడగించినట్లుగా తెలుస్తుంది. కాగా సమావేశాలు ముగిసే వరకూ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని బీజేపీఎంపీలకు హోంమంత్రి అమిత్‌షా సూచించినట్లు సమాచారం. -
యడ్డి పునరాగమనంపై అధిష్టానందే తుది నిర్ణయం
సాక్షి, బళ్లారి : మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి చేర్చుకునే విషయంపై పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి అన్నారు. శనివారం ఆయన నగరంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్పను పార్టీలో చేర్చుకునే విషయంపై ఇప్పటికే పార్టీలో పలుమార్లు చర్చించారన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడంపై యడ్యూరప్ప స్వాగతించడం, ఎన్డీఏ కూటమికి తాను మద్దతు ఇస్తానని చెప్పడం వంటి పరిణావూలు ఆయన బీజేపీలోకి తిరిగి వచ్చే శుభసూచనలన్నారు. మొత్తం మీద యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి వస్తారనే విషయం ఆయన పరోక్షంగా వెల్లడించారు. ధరల పెరుగుదల ఓ వైపు, అవినీతి కుంభకోణాలు మరో వైపు ఉండడంతో యూపీఏపై ప్రజలు విసిగిపోయారన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పాలనకు తెరపడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కాంగ్రెస్ రహిత భారత్ ఏర్పడాలంటే మోడీ ద్వారానే సాధ్యమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని జోస్యం చెప్పారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ మార్గదర్శనం, మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. లోక్‌సభకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు, అభ్యర్థుల ఎంపికపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత లోక్‌సభ సభ్యులకు తిరిగి బీజేపీ టికెట్ ఖరారు చేసేది లేనిది పార్టీ హైకమాండ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుంటారన్నారు. బళ్లారిలో లోక్‌సభ అభ్యర్థిగా ఇంతవరకు ఎవరి పేరూ ప్రకటించలేదని, ఎవరైనా వారికి వారే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకుని ఉంటే తమకు సంబంధం లేదన్నారు. అలాంటి వారిపై పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీటీ రవి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.