న్యూఢిల్లీ: ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరెన్నో రకాలుగా కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. సెపె్టంబర్ 18–22 మధ్య ఐదు రోజుల పాటు వాటిని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషీ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఉభయ సభల్లో సాధారణంగా ఉదయాన్నే చేపట్టే ప్రశ్నోత్తరాలు ఈ సమావేశాల్లో ఉండబోవు. అలాగే ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వబోరు.
రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు శనివారం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘17వ లోక్‌సభ 13వ సమావేశాలు సెపె్టంబర్ 18 సోమవారం మొదలవుతాయి. ఉభయ సభలు సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది‘ అని లోక్‌సభ సచివాలయం; ‘రాజ్యసభ 261వ సమావేశాలు మొదలవుతాయి‘ అని రాజ్యసభ సచివాలయం వేర్వేరు బులెటిన్లలో పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉంచడం తెలిసిందే.
ప్రత్యేక భేటీ కొత్త భవనంలో...?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత లోక్‌సభకు చివరివి అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ఉభయ సభలు సభ్యులకు ప్రత్యేక గ్రూప్ ఫోటో సెషన్‌కు ఏర్పాట్లు జరుగుతుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఈ సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశముందని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి కొత్త భవనంలో జరిగే తొలి సమావేశాలు గనుక ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తుండవచ్చని కూడా కొందరు అంటున్నారు. అత్యాధునిక రీతిలో సర్వ హంగులతో రికార్డు సమయంలో నిర్మితమైన పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత మే 28న ప్రారంభించడం తెలిసిందే.
ప్రత్యేక సమావేశాలు ఇలా...
ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రోవిజనల్ కేలండర్‌ను ఎంపీలకు విడిగా తెలియజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment