సాక్షి, బళ్లారి : మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి చేర్చుకునే విషయంపై పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి అన్నారు. శనివారం ఆయన నగరంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్పను పార్టీలో చేర్చుకునే విషయంపై ఇప్పటికే పార్టీలో పలుమార్లు చర్చించారన్నారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడంపై యడ్యూరప్ప స్వాగతించడం, ఎన్‌డీఏ కూటమికి తాను మద్దతు ఇస్తానని చెప్పడం వంటి పరిణావూలు ఆయన బీజేపీలోకి తిరిగి వచ్చే శుభసూచనలన్నారు. మొత్తం మీద యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి వస్తారనే విషయం ఆయన పరోక్షంగా వెల్లడించారు. ధరల పెరుగుదల ఓ వైపు, అవినీతి కుంభకోణాలు మరో వైపు ఉండడంతో యూపీఏపై ప్రజలు విసిగిపోయారన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పాలనకు తెరపడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
కాంగ్రెస్ రహిత భారత్ ఏర్పడాలంటే మోడీ ద్వారానే సాధ్యమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని జోస్యం చెప్పారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ మార్గదర్శనం, మోడీ నాయకత్వంలో ఎన్‌డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. లోక్‌సభకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు, అభ్యర్థుల ఎంపికపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ప్రస్తుత లోక్‌సభ సభ్యులకు తిరిగి బీజేపీ టికెట్ ఖరారు చేసేది లేనిది పార్టీ హైకమాండ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుంటారన్నారు. బళ్లారిలో లోక్‌సభ అభ్యర్థిగా ఇంతవరకు ఎవరి పేరూ ప్రకటించలేదని, ఎవరైనా వారికి వారే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకుని ఉంటే తమకు సంబంధం లేదన్నారు. అలాంటి వారిపై పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీటీ రవి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
యడ్డి పునరాగమనంపై అధిష్టానందే తుది నిర్ణయం
Published Sun, Sep 15 2013 1:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement