డిల్లీ లో తలైవా
♦ మోదీ, అద్వానీలతో భేటీ కసరత్తు
♦ కమలంలో జోష్
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీలతో భేటీకి కసరత్తుల్లో ఉన్నారన్న సమాచారం రాష్ర్టం లోని కమలనాథుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సాగనున్న ఈ భేటీని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు.
సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అశేషాభిమానుల గురించి తెలిసిందే. ఆయన్ను రాజకీయాల్లో రప్పిం చేందుకు అభిమానులతో పాటు పలు పార్టీలు తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నాయి. అయితే తలైవా ఎక్కడా చిక్కడం లేదు. దేవుడు ఆదేశిస్తే...అంటూ తనదైన బాణిలో ముందుకు సాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయాల్లో మాత్రం ఆయన వ్యవహార శైలి మీద అభిమానులు ఓ కన్ను వేయడం సహజం. ఆ దిశగా గతంలో ఓ మారు బీజేపీకి అనుకూలంగా ఆయన పరోక్ష సంకేతం ఇవ్వడం జరిగింది. అయితే, ఆ ఎన్నికల్లో రజనీకాంత్ సంకేత పాచికలు పారలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అనుకూలంగా పరోక్షం వ్యాఖ్యలతో ముందుకు సాగిన రజనీకాంత్, తదుపరి మౌన ముద్ర అనుసరించడం మొదలెట్టారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ స్వయంగా రజనీకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఆ సమయంలో తలై‘వా’ అంటూ అభిమానులు నినదించినా రాజకీయాల వైపు మాత్రం తలెత్తి చూడలేదు. యథాప్రకారం తన దైన శైలిలో పరోక్ష సంకేతంతో లింగా సినిమా మీద దృష్టి పెట్టారు.
ఆ తర్వాత కొంత కాలంగా రాజకీయ వార్తలకు దూరంగా ఉన్న రజనీకాంత్ పేరును మళ్లీ తెరమీదకు తెచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికలు దోహదకారిగా మారి ఉన్నాయి. ఆయన్ను రాజకీయాల్లో రప్పించేందుకు ప్రయత్నాలు చేసి చివరకు మద్దతు కోసం కమలనాథులు తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నారు. మెగా కూటమి యత్నాలు పటాపంచెలు కావడంతో, ఇక, కథానాయకుడి మద్దతు కూడగట్టుకుని ఎలాగైనా తమ ప్రతినిధుల్ని అసెంబ్లీలో అడుగు పెట్టించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నారు. ఈ సమయంలో సూపర్ స్టార్ ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేత అద్వానీలను కలవడానికి అనుమతి కోరిన సమాచారంతో కమలనాథుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ భేటీని తమకు అనుకూలంగా మలచుకుని సూపర్ స్టార్ పరోక్ష సంకేతాలు తమ వైపు ఉండేందుకు తగ్గ వ్యూహాల్ని రచించే పనిలో పడ్డారు.
ఢిల్లీలో తలైవా : స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ రోబో -2(2.వో) చిత్రీకరణ ఢిల్లీలో సాగుతోంది. నెల రోజుల పాటుగా అక్కడి ఓ స్టేడియంలో ఈ షూటింగ్‌కు ఏర్పాట్లు చేసి ఉన్నారు. నెల రోజులు అక్కడే బస చేయాడానికి సూపర్‌స్టార్ నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెలాఖరులో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సైతం ఉండడంతో పనిలో పనిగా అక్కడే ఉండి ఆ పురష్కారం అందుకునేందుకు రజనీ కాంత్ సిద్ధమవుతున్నారు. షూటింగ్‌లో భాగంగా ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్‌నేత అద్వానీలను కలవడానికి అనుమతి కోరి ఉండడం గమనార్హం. రజనీకాంత్ తరఫున ఈ అనుమతి కోరుతూ, వినతి పత్రం ఈ- మెయిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేత అద్వానీల కార్యాలయాలకు చేరాయి. పద్మా అవార్డుల ప్రదానోత్సవానికి ముందే ఈ భేటీకి తగ్గ అనుమతి రజనీ కాంత్‌కు దక్కవచ్చని కమలనాథులు పేర్కొంటుంన్నాయి. ఈ భేటీ ద్వారా రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా కథానాయకుడు ఏదేని పరోక్ష సంకేతాం ఇస్తారన్న భావనలో కమలనాథులు పడ్డారు.