Robot 2
-
కరోనా కట్టడికి కొత్త టెక్నాలజీతో భారత సంస్థ
జైపూర్ : కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన క్లబ్ ఫస్ట్ కంపెనీ తన వంతుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్యులకు, ఆసుపత్రిలోని మిగతా సిబ్బందికి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అరికట్టడానికి సొంత టెక్నాలజీతో రూపొందించిన సోనా2.5, సోనా 1.5, సోనా 0.5 రోబోలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఆసుపత్రుల్లోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వైరస్ సోకకుండా నివారించేందుకు రోబో సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పేషెంట్లు, హెల్త్ సిబ్బందికి మధ్య ఇంటరాక్షన్‌ను తగ్గించడంతోపాటూ పీపీఈ కిట్ల కొరత కారణంగా వాటి వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. పేషెంట్లకు ఫుడ్, మెడిసిన్స్ అందజేయడం, చెత్తను సేకరించే పనులను సైతం ఈ రోబోలు సులువుగా చేయగలవు. ఇందులో అమర్చిన కెమెరా ద్వారా రోగి ఏం చేస్తున్నాడో వైద్యులు తమ గదిలోని స్క్రీన్‌పై చూడవచ్చు. సోనా2.5, సోనా 1.5, సోనా 0.5 రోబోలు థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటూ మాస్కులు ధరించారా లేదా అనే విషయాలను కూడా గుర్తించగలవని సంస్థ ఎండీ భువనేశ్ మిశ్రా తెలిపారు. తాము తయారు చేస్తోన్న రోబోల్లో 95శాతం భారత ముడిసరుకులనే వాడుతున్నామన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా స్పైన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ రోబోలను తయారు చేశామని చెప్పారు. ఈ టెక్నాలజీతో పనులు చేసే సమయాల్లో రోబోలు బ్యాలెన్సింగ్ చేసుకోవడం చాలా సులువు అవుతుందని తెలిపారు. సోనా2.5, సోనా 1.5, సోనా 0.5 రోబోలు ఏదో ఒక మార్గాల్లోనే వెళ్లేవి కావని, స్వీయ మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం ఉన్న రోబోలు అని భువనేశ్ మిశ్రా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘స్వయం సంవృద్ధి’ పిలుపుతో ముందుకు అడుగులేస్తోంది క్లబ్ ఫస్ట్ కంపెనీ. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెద్ద మొత్తంలో రోబోలను తయారు చేయడం ప్రారంభించింది. రోబోల బరువు ఆధారంగా విభజించి డిజైన్లలో మార్పులు చేశారు. ఇంకా అగ్రిమాపక సిబ్బందికి ఆపద సమయాల్లో ఉపయోగపడే రోబోలను సైతం ఈ సంస్థ తయారు చేస్తోంది. -
2017 దీపావళికి రోబో సీక్వల్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.0. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, బ్రిటీష్ బ్యూటి ఎమీజాక్సన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని భావించినా.. భారీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్ధాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. -
రోబో 2.0లో నేను కాకినా?
ఇప్పటివరకూ హిందీ చిత్రాల్లో హీరోగా విలన్లను రఫ్ఫాడించిన అక్షయ్‌కుమార్ ఇప్పుడు తానే విలన్ అయిపోయారు. రజనీకాంత్ ఇచ్చే పంచ్‌లను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రోబో 2.0’లో అక్షయ్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కాంబినేషన్లో నటించడం ఆనందంగా ఉందని అక్షయ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆయన కాకిగా మారే పిచ్చి శాస్త్రవేత్తగా కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. కాకి గెటప్‌లో ఓ ఫొటో కూడా బయటి కొచ్చింది. ‘‘నేను పిచ్చి సైంటిస్ట్నా? కాకినా? ఇది నాకు కొత్త న్యూస్. ఎవరేమైనా ఊహించుకోండి. అందరి ఊహలకు భిన్నంగా కనిపిస్తా’’ అని అక్షయ్ అన్నారు. ఈ చిత్రంలో ఆయన మేకప్‌కే ఆరు గంటలు పట్టిందట. విచిత్రంగా కనిపిస్తారనే టాక్ కూడా ఉంది. ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే - ‘‘ఇప్పుడా వివరాలేవీ చెప్పను. ఒకే ఒక్క విషయం చెబుతాను. ఈ మధ్య నేనో హోటల్కెళ్లాను. మేకప్ వేసుకునే వెళ్లాను. ఎవరూ నన్ను విచిత్రంగా చూడలేదు. అంటే చూడ్డాని కి విచిత్రంగా లేననే కదా అర్థం. ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు కూడా. దాంతో హాయిగా ఫుడ్‌ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు. గెటప్ విచిత్రంగా ఉండదంటున్నారు.. ఎవరూ గుర్తుపట్టలేదంటున్నారు. మరి.. ‘రోబో 2.0’లో అక్షయ్ ఎలా కనిపిస్తారో చూడాలి. -
చలో బొలీవియా
‘రోబో-2’ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి గ్రాఫిక్స్ వర్క్‌లో శంకర్ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీరికలేని పనిలో ఉన్నారు. రజనీకాంత్‌ను మరోసారి రోబోగా చూపిస్తూ, తీస్తున్న కొత్త చిత్రం ‘2.0’ షూటింగ్ వ్యవహారంతో తలమునకలుగా ఉన్నారు. దాదాపు గడచిన మూడు, నాలుగు వారాలుగా ఢిల్లీలోని నెహ్రూ స్టేడియమ్లో కీలక సన్నివేశాలను శంకర్, ఆయన బృందంలోని ఇతర నిపుణులు షూటింగ్ చేస్తూ వచ్చారు. హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్ కుమార్ తదితరుల మీద వచ్చే ఆ స్టేడియమ్ దృశ్యాలను వారం, పది రోజుల క్రితమే పూర్తి చేశారు. శుక్రవారంతో ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు సమాచారం. హీరో, విలన్, మరో కీలక పాత్రధారిణి అమీ జాక్సన్‌ల మీద కావాల్సిన దృశ్యాలను చిత్రీకరించిన దర్శకుడు అటుపైన ఆ దృశ్యాలకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ పనుల మీద పడ్డారు. కళాదర్శకుడు ముత్తురాజ్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు శ్రీనివాస మోహన్, కెమేరామన్ నీరవ్ షా, యాక్షన్ దృశ్యాల సారథి కెన్నీ బేట్స్లతో కలసి శంకర్ ఆ వ్యవహారంలో ఉన్నారు. మరోపక్క రజనీకాంత్ తన మరో చిత్రం ‘కబాలి’కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఆ పనులు పూర్తయ్యాక, మళ్ళీ ‘2.0’లోకి వచ్చేస్తారాయన. ‘‘ఈ స్వల్ప విరామం తరువాత యూనిట్ మొత్తం బొలీవియాకు వెళుతున్నాం. అక్కడ ఒకటి, రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని ‘2.0’ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఎమీ జాక్సన్, సుధాంశు పాండే తదితరులు నటించగా, ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం. -
డిల్లీ లో తలైవా
♦ మోదీ, అద్వానీలతో భేటీ కసరత్తు ♦ కమలంలో జోష్ దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీలతో భేటీకి కసరత్తుల్లో ఉన్నారన్న సమాచారం రాష్ర్టం లోని కమలనాథుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సాగనున్న ఈ భేటీని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అశేషాభిమానుల గురించి తెలిసిందే. ఆయన్ను రాజకీయాల్లో రప్పిం చేందుకు అభిమానులతో పాటు పలు పార్టీలు తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నాయి. అయితే తలైవా ఎక్కడా చిక్కడం లేదు. దేవుడు ఆదేశిస్తే...అంటూ తనదైన బాణిలో ముందుకు సాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయాల్లో మాత్రం ఆయన వ్యవహార శైలి మీద అభిమానులు ఓ కన్ను వేయడం సహజం. ఆ దిశగా గతంలో ఓ మారు బీజేపీకి అనుకూలంగా ఆయన పరోక్ష సంకేతం ఇవ్వడం జరిగింది. అయితే, ఆ ఎన్నికల్లో రజనీకాంత్ సంకేత పాచికలు పారలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అనుకూలంగా పరోక్షం వ్యాఖ్యలతో ముందుకు సాగిన రజనీకాంత్, తదుపరి మౌన ముద్ర అనుసరించడం మొదలెట్టారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ స్వయంగా రజనీకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఆ సమయంలో తలై‘వా’ అంటూ అభిమానులు నినదించినా రాజకీయాల వైపు మాత్రం తలెత్తి చూడలేదు. యథాప్రకారం తన దైన శైలిలో పరోక్ష సంకేతంతో లింగా సినిమా మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత కొంత కాలంగా రాజకీయ వార్తలకు దూరంగా ఉన్న రజనీకాంత్ పేరును మళ్లీ తెరమీదకు తెచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికలు దోహదకారిగా మారి ఉన్నాయి. ఆయన్ను రాజకీయాల్లో రప్పించేందుకు ప్రయత్నాలు చేసి చివరకు మద్దతు కోసం కమలనాథులు తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నారు. మెగా కూటమి యత్నాలు పటాపంచెలు కావడంతో, ఇక, కథానాయకుడి మద్దతు కూడగట్టుకుని ఎలాగైనా తమ ప్రతినిధుల్ని అసెంబ్లీలో అడుగు పెట్టించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నారు. ఈ సమయంలో సూపర్ స్టార్ ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేత అద్వానీలను కలవడానికి అనుమతి కోరిన సమాచారంతో కమలనాథుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ భేటీని తమకు అనుకూలంగా మలచుకుని సూపర్ స్టార్ పరోక్ష సంకేతాలు తమ వైపు ఉండేందుకు తగ్గ వ్యూహాల్ని రచించే పనిలో పడ్డారు. ఢిల్లీలో తలైవా : స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ రోబో -2(2.వో) చిత్రీకరణ ఢిల్లీలో సాగుతోంది. నెల రోజుల పాటుగా అక్కడి ఓ స్టేడియంలో ఈ షూటింగ్‌కు ఏర్పాట్లు చేసి ఉన్నారు. నెల రోజులు అక్కడే బస చేయాడానికి సూపర్‌స్టార్ నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెలాఖరులో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సైతం ఉండడంతో పనిలో పనిగా అక్కడే ఉండి ఆ పురష్కారం అందుకునేందుకు రజనీ కాంత్ సిద్ధమవుతున్నారు. షూటింగ్లో భాగంగా ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్‌నేత అద్వానీలను కలవడానికి అనుమతి కోరి ఉండడం గమనార్హం. రజనీకాంత్ తరఫున ఈ అనుమతి కోరుతూ, వినతి పత్రం ఈ- మెయిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేత అద్వానీల కార్యాలయాలకు చేరాయి. పద్మా అవార్డుల ప్రదానోత్సవానికి ముందే ఈ భేటీకి తగ్గ అనుమతి రజనీ కాంత్‌కు దక్కవచ్చని కమలనాథులు పేర్కొంటుంన్నాయి. ఈ భేటీ ద్వారా రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా కథానాయకుడు ఏదేని పరోక్ష సంకేతాం ఇస్తారన్న భావనలో కమలనాథులు పడ్డారు. -
రజనీతో కలిసి చేయడం అద్భుతం!
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమా సీక్వెల్లో కలిసి నటించడం అద్భుతంగా అనిపిస్తోందని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నాడు. సీక్వెల్లో కూడా రజనీకాంత్ సైంటిస్టుగాను, ఆయన తయారుచేసే రోబో 'చిట్టి'గాను నటిస్తుండగా, విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. ఇప్పటికే తన సినీజీవితంలో అనేక ఫైట్లు చేశానని, ఇప్పుడు రజనీకాంత్ లాంటి సూపర్ హీరోతో పంచ్‌లు తినడం చాలా గొప్పగా అనిపిస్తోందని అక్షయ్ చెప్పాడు. నెగెటివ్ పాత్ర పోషించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కావడం లేదు. దానికి ఎలాంటి ట్రైనింగు తీసుకోవట్లేదని అక్షయ్ చెప్పాడు. నన్నెవరూ చూడలేదు తాను ఇంతకుముందు రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని అక్షయ్ గుర్తుచేసుకున్నాడు. తాను ఆయన వద్దకు వెళ్లేసరికి 15 మంది ఆయన కోసం వేచి చూస్తున్నారని, అందరూ ఆయనవైపే చూస్తున్నారని అన్నాడు. ఆయన టీ తాగుతూ.. ప్యాంటుమీద దుమ్ము ఉంటే దులుపుకొన్నారని, అందరూ ఒక్కసారిగా ఊపిరి భారంగా పీల్చుకున్నారని చెప్పాడు. తాను కూడా తన ప్యాంటు మీద దుమ్ము ఉంటే దులుపుకొన్నానని, కానీ అయితే అక్కడ ఎవరూ తనవైపు చూడలేదని తెలిపాడు. రోబో మొదటి భాగంలో ఐశ్వర్యారాయ్ నటించగా.. సీక్వెల్లో మాత్రం అమీ జాక్సన్ నటిస్తోంది. అలాగే డేనీ స్థానంలో అక్షయ్ వస్తున్నాడు. -
'ఆ మొదటి బాలీవుడ్ నటుణ్ని నేనే'
ముంబై: పాతికేళ్ల కెరీర్లో బాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేశాడు అక్షయ్‌కుమార్. 'బేబీ', 'స్పెషల్ 26', 'ఎయిర్‌లిఫ్ట్', 'ఓ మై గాడ్' వంటి సందేశాత్మక సామాజిక చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు ఆయన. తాజాగా తొలిసారి తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు ఈ యాక్షన్ స్టార్. రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రోబో 2' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తొలిసారి తమిళ సినిమాలో నటిస్తున్న మొదటి బాలీవుడ్ నటుణ్ని తానేనని అక్షయ్‌కుమార్ చెప్పారు. 'తమిళ సినిమాలో నటిస్తున్న తొలి బాలీవుడ్ నటుణ్ని నేనే కావడం చాలా ఆనందం కలిగిస్తోంది. దక్షిణాది సినిమాల్లో సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకుంటారు. బాలీవుడ్ హీరోలు దక్షిణాది సినిమాల్లో నటించరు. ఈ అపనమ్మకాన్ని నేను బ్రేక్ చేస్తున్నా. ఇప్పటివరకు మరాఠీ, పంజాబీ సినిమాల్లో నటించా. ఇకముందు గుజరాతీ, బిహారీ, బెంగాలీ సినిమాల్లో కూడా నటిస్తా' అని అక్షయ్ విలేకరులకు తెలిపారు. 'రోబో -2' కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉందని, అయితే అదేమిటో ఇప్పుడే చెప్పబోనని ఆయన అన్నారు. ద్విభాష చిత్రంగా 'రోబో 2' తమిళం, హిందీలో తెరకెక్కుతున్నదా? అనే విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించలేదు. మరో నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, దాదాపు ఏడాది తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అప్పుడే అన్ని విషయాలు తెలిసే అవకాశముందని చెప్పారు. -
ఇప్పడే మాట్లాడే హక్కు, నాకు లేదు
తొలిసారిగా సౌత్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తను హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ఎయిర్ లిఫ్ట్ ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో వరుసగా దేశభక్తి కనబరిచే సినిమాల్లో నటించటంపై స్పందించాడు. దీంతో పాటు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రోబో 2 సినిమాలో నటించటంపై మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. 2014లో హాలీడే, 2015లో బేబి సినిమాలో అలరించిన అక్షయ్ మరోసారి అదే తరహాలో తెరకెక్కిన ఎయిర్ లిఫ్ట్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రోబో సినిమాలో నటించటం పై కూడా స్పందించాడు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించటం ఎంతో ఆనందంగా ఉందన్న అక్షయ్, సినిమాకు సంబందించిన విషయాలను వెల్లడించే అధికారం నాకు లేదన్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న రోబో 2లో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, ఐ సినిమాలో హీరోయిన్గా నటించిన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రజనీ వద్దన్నారు..అందుకే ‘2.ఒ’ ఒప్పుకోలేదు!
దక్షిణాదిన అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన మొదటి చిత్రం ‘రోబో’. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ ‘2.ఒ’ రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ని విలన్‌గా నటింపజేయాలని శంకర్ అనుకున్నారట. అమితాబ్‌కు ఆయన ఈ విషయం చెప్పారట. శంకర్ ఈ విషయం చెప్పగానే రజనీకి ఫోన్ కొట్టారు బిగ్ బి. ‘‘మిమ్మల్ని విలన్‌గా ప్రేక్షకులు అంగీకరించరు. అందుకని వద్దు’’ అని రజనీ అన్నారు. నేను కూడా ఓకే అన్నాను’’ అని అమితాబ్ పేర్కొన్నారు. -
ట్రైనింగ్ తీసుకుంటున్న అక్షయ్
రజనీ, శంకర్ల కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2. దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ విజువల్ వండర్‌ను ఇప్పుడు మరింత భారీగా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జాతీయ స్థాయి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలన్ పాత్రకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్‌ను సంప్రదించినా, డేట్స్ కుదరకపోవటంతో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌తో చేయిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించాడు అక్షయ్. పాత్రకు తగ్గట్టుగా బరువు పెరగాల్సి ఉండటంతో చెన్నైలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. దీంతో పాటు సినిమాకు కావాల్సిన కొన్ని యాక్షన్ స్టంట్స్‌కు సంబందించిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. డిసెంబర్ 16న షూటింగ్ ప్రారంభమైన రోబో సీక్వల్ ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరిలో అక్షయ్ కుమార్ రోబో 2 షూటింగ్లో పాల్గొంటారు. -
‘రోబో-2’లో అక్షయ్ విలనా?
రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో ‘రోబో’ సీక్వెల్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. 400 కోట్ల రూపాయలతో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘2.0’. త్రీడీ ఎఫెక్ట్‌తో పాటు ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషించడం ఓ విశేషం. అయితే, ఇందులో అక్షయ్ విలన్‌గా చేస్తున్నారనే చెన్నై సమాచారం. ఇందులో ఎమీ జాక్సన్ కథానాయిక. ‘జురాసిక్ పార్క్’, ‘ఐరన్ మేన్’, ‘ఎవెంజర్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేసిన యానిమాట్రిక్స్ సంస్థ దీనికి పని చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. రహమాన్, కెమెరా: నిరవ్ షా. -
నో సెలబ్రేషన్స్!
ఈ నెల 12 సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు చాలా ప్రత్యేకమై రోజు. ఏడాది మొత్తం ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. వీలైనంత ఘనంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఈ సెలబ్రేషన్స్ కోసం నెల రోజులు ముందే సన్నాహాలు మొదలుపెట్టేస్తారు. ఇంతకీ ఈ రోజుకి ప్రత్యేకత ఏంటంటే.. రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 65వ పడిలోకి అడుగుపెడతారు. ఈ బర్త్‌డేని ఘనంగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే, రజనీ సెలబ్రేట్ చేసుకునే మూడ్‌లో లేరు. అసలే రజనీకి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరికను కాదనలేక నిరాడంబరంగా చేసుకుంటారు. అయితే, ఈసారి అది కూడా వద్దనుకుంటున్నారట. భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోకూడదని రజనీ నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే... ‘రోబో’కి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ ‘రోబో-2’ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందనుంది. రజనీ పుట్టినరోజు నాడు లాంఛనంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపాలనుకున్నారట. అయితే, ఈ వేడుకకు కూడా వర్షాలు ఆటంకం అయ్యాయి. ఒకవైపు రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోవడంతో కొత్త సినిమా ఏం ప్రారంభిస్తామని అనుకున్నారట. అందుకని ఆ రోజు పూజా కార్యక్రమాలు జరపాలనుకున్న ఆలోచనను విరమించుకున్నారట. అభిమాన నాయకుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోవడం, ‘రోబో-2’ ఆరంభం వాయిదా పడటం అభిమానులను ఒకింత నిరాశపరిచే విషయమే అయినా, దానికి బలమైన కారణం ఉంది కాబట్టి సర్దిచెప్పుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
ఈసారి... ఆ సన ఈవిడేనట!
గాసిప్ మొన్నటి వరకు ‘రోబో-2’ సినిమాలో నటించబోయే విలన్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ‘రోబో-2’కు రెగ్యులర్ విలన్ కాకుండా హీరోతో సమానమైన విలన్ ఉండాలనేది డెరైక్టర్ శంకర్ కోరికట. దీని కోసం షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌ల నుంచి కమల్‌హాసన్ వరకు ప్రయత్నించారట. కానీ అది అంత సులభం కాదని అర్థమైంది. ఈ సైన్స్-ఫిక్షన్లో హీరో విక్రమ్ విలన్‌గా నటించనున్నాడనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎవరినో ఎందుకు? ‘రోబో-1’లాగే రజనీకాంత్ వర్సెస్ రజనీకాంత్ ఫార్ములా ప్రకారం...రజనినే విలన్‌గా పెట్టవచ్చు కదా అని కొందరు అంటున్నా...శంకర్ ససేమిరా అంటున్నాడట. విలన్ సంగతి పక్కనపెట్టండి, ఇప్పుడు హీరోయిన్ గురించిన చర్చ నడుస్తుంది. ఇంతకీ ‘రోబో-2’లో హీరోయిన్ ఎవరు? అని. మొదటి ‘రోబో’లో ‘సన’గా ఐశ్వర్యరాయ్ గ్లామర్‌పరంగానే కాదు నటన పరంగా కూడా బోలెడు మార్కులు కొట్టేసింది. మరి ఆ స్థాయిలో చేసే హీరోయిన్ ఎవరు? ‘రోబో-2’లో దీపికా పడుకోణ్ నటిస్తుందనే వార్తలను ఆమె స్వయంగా ఖండించింది. అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు... ఆమీ జాక్సన్. శంకర్ ‘ఐ’ సినిమాలో ఈ బ్రిటన్ సుందరి హీరోయిన్గా చేసింది. ఆమె నటనకు మంచి మార్కులే వేశాడు శంకర్. ‘మదరాసపట్టినం’తో భారతీయ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆమీ ఆ సినిమాలో ఇంగ్లీష్ దొరసానిగా ప్రేక్షకులను మెప్పించింది. ‘ఏక్ దివాన థా’ సినిమాలో చక్కని నటన ప్రదర్శించింది. రాంచరణ్ ‘ఎవడు’ సినిమాతో తెలుగు ప్రేక్షలకూ దగ్గరైంది.సినిమా రంగంలో బలమైన సెంటిమెంట్లు ఉంటాయి. విక్రమ్, ఆమీ జాక్సన్‌లు నటించిన ‘ఐ’ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆమీ జాక్సన్‌ను రిపీట్ చేసే ఛాన్సు లేదనేది కూడా ఒక టాక్. అయితే స్టార్ డెరైక్టర్ శంకర్ ‘సెంటిమెంట్’లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడని అనేవాళ్లు కూడా ఉన్నారు. చూద్దాం మరి... రోబో-2 ఎవరిని ప్రేమించనున్నాడో!