చలో బొలీవియా
‘రోబో-2’ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి గ్రాఫిక్స్ వర్క్‌లో శంకర్
దర్శకుడు శంకర్ ఇప్పుడు తీరికలేని పనిలో ఉన్నారు. రజనీకాంత్‌ను మరోసారి రోబోగా చూపిస్తూ, తీస్తున్న కొత్త చిత్రం ‘2.0’ షూటింగ్ వ్యవహారంతో తలమునకలుగా ఉన్నారు. దాదాపు గడచిన మూడు, నాలుగు వారాలుగా ఢిల్లీలోని నెహ్రూ స్టేడియమ్‌లో కీలక సన్నివేశాలను శంకర్, ఆయన బృందంలోని ఇతర నిపుణులు షూటింగ్ చేస్తూ వచ్చారు.
హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్ కుమార్ తదితరుల మీద వచ్చే ఆ స్టేడియమ్ దృశ్యాలను వారం, పది రోజుల క్రితమే పూర్తి చేశారు. శుక్రవారంతో ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు సమాచారం. హీరో, విలన్, మరో కీలక పాత్రధారిణి అమీ జాక్సన్‌ల మీద కావాల్సిన దృశ్యాలను చిత్రీకరించిన దర్శకుడు అటుపైన ఆ దృశ్యాలకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ పనుల మీద పడ్డారు.
కళాదర్శకుడు ముత్తురాజ్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు శ్రీనివాస మోహన్, కెమేరామన్ నీరవ్ షా, యాక్షన్ దృశ్యాల సారథి కెన్నీ బేట్స్‌లతో కలసి శంకర్ ఆ వ్యవహారంలో ఉన్నారు. మరోపక్క రజనీకాంత్ తన మరో చిత్రం ‘కబాలి’కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఆ పనులు పూర్తయ్యాక, మళ్ళీ ‘2.0’లోకి వచ్చేస్తారాయన. ‘‘ఈ స్వల్ప విరామం తరువాత యూనిట్ మొత్తం బొలీవియాకు వెళుతున్నాం.
అక్కడ ఒకటి, రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని ‘2.0’ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఎమీ జాక్సన్, సుధాంశు పాండే తదితరులు నటించగా, ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం.