రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్, అమీజాక్సన్
సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ఎంతో స్టైల్‌గా, కాన్ఫిడెంట్‌గా అన్న మాటలివి. కొట్టాలంటే.. హిట్‌ని ఉద్దేశించి అంటున్నా అని ఆయన సరదాగా అన్నారు. కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురయ్యారు కూడా. ఉదాహరణకు ‘2.0’ చేస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా లేక ‘ఇక నా వల్ల కాదు శంకర్’ అనే మాటలను. ‘నా తల్లీతండ్రి, దైవం అయినా మా అన్నయ్య, అప్పుడప్పుడు నా తప్పులను మన్నించిన మా అన్నయ్య ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది’ అని మాటలను వేదిక సాక్షిగా అన్నప్పుడు రజనీకాంత్ కళ్లు చెమర్చడం విశేషం.
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. పూర్తిగా త్రిడీ ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ నెల 29న ‘2.0’ని విడుదల చేస్తున్న సందర్భంగా చెన్నైలో 4డి ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆత్మవిశ్వాసం పోయింది
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘సుభాస్కరన్‌కి, శంకర్‌కి అడ్వా¯Œ్స కంగ్రాట్స్. శంకర్‌ని నమ్మి నిర్మాత 600 కోట్లు పెట్టారు. అంతేగానీ నన్నో, అక్షయ్‌కుమార్‌నో నమ్మి కాదు. ఆడియ¯Œ్స ఎక్స్‌పెక్టేషన్, నిర్మాతల ఎక్స్‌పెక్టేషన్‌ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంకర్. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి.
ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు ప్రమోషన్ తక్కువగా ఉందని కొందరు అంటున్నారు. కానీ ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ అవసరంలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్ టెక్నాలజీ ఎలా స్పాయిల్ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తీయగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు ‘ఇదెలా వర్కవుట్ అవుతుంది?’ అని అడగలేదు.
ఎవరు నిర్మిస్తున్నారు? అని మాత్రం అడిగాను. ‘శివాజీ’ చేసేటపుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపయింది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ‘రోబో’ తీయాలనుకున్నప్పుడు ‘శివాజీ’ ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్‌తో చేస్తాం..పెట్టింది వస్తే చాలన్నారు సన్ పిక్చర్స్ వాళ్లు.. దానికన్నా 20–30 పర్సెంట్ బడ్జెట్ ఎక్కువయింది. అయినా రెండింతలు వసూలు చేసింది. ‘రోబో’ కలెక్ట్ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని ‘2.0’ మొదలుపెట్టాం. అందుకే ముందు రూ. 300కోట్లు అనుకున్నాం.
ఇప్పుడు డబుల్ అయింది. తప్పకుండా అంతకు డబుల్ కలెక్ట్ చేస్తుంది. ‘కబాలి’ ఒక షెడ్యూల్ చేసిన తర్వాత నాకు ఆరోగ్యం బాగా లేకుండాపోయింది. ‘2.0’ కోసం 5 రోజులు షూట్ చేశా. 7, 8 రోజులైంది. అప్పటికే నాకు ఆత్మవిశ్వాసం పోయింది. ‘నేను జస్టిఫై చేయలేను. ఖర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయలేను’ అని శంకర్‌ని పిలిచి చెప్పా. ‘మీరు జస్ట్ అలా రండి. మీరు కన్ను చూపించండి.. మిగిలింది మొత్తం మనం చేద్దాం’ అన్నారు. 12 నుంచి 14 కేజీల బరువు ఉన్న బాడీ సూట్ వేసుకోవాలి. అది వద్దన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్ వేసుకుంటా అని అన్నాను.
‘కబాలి’ కోసం మలేసియాకి వెళ్లినప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడయింది. అప్పుడు డాక్టర్ నాలుగైదు నెలలు రెస్ట్ కావాలన్నారు. ఆ విషయం నిర్మాత సుభాస్కరణ్‌కు తెలిసి మా ఇంటికి వచ్చి ‘నాలుగు నెలలు కాదు, నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తా. నాకు డబ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం’ అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అంటే.. ఓ కోహినూర్ డైమండ్ దొరికినట్టే. ఈ సినిమా చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్ అయినా, కరెక్ట్‌గా రావాలి. వస్తే, ష్యూర్‌గా కొట్టాలి. మేం హిట్ కొడుతున్నాం. శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ హిరానీ లాంటివారు జెమ్స్ ఆఫ్ ఇండస్ట్రీ’’ అన్నారు.
టన్నుల కొద్దీ కష్టపడ్డాం
శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఊహే ఈ కథ. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాకు గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీసార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్ డైరెక్టర్లు, వీఎఫ్ ఎక్స్ డైరెక్టర్లు, అక్షయ్ కుమార్, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అది. దాదాపు 500–1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు సూట్ వేసుకుని క్లైమాక్స్ చేశారు.
ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఇలాంటి డెడికేషన్ వల్లనే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత కష్టం ఏ సినిమాకీ పడి ఉండరు. రెహమా¯Œ మళ్లీ మళ్లీ మ్యూజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా పాటల్లాగానే ఉన్నాయి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడి చేసిన చిత్రమిది. మీడియా సపోర్ట్ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం.
ఈ సినిమా కథను రాసేటప్పుడు ఇది త్రీడీలో తీస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు’’ అని అన్నారు. ‘‘2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం’’ అన్నారు కెమెరామేన్ నీరవ్ షా .
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్, శంకర్‌సార్, రెహమాన్‌గారితో కలిసి ‘2.0’లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్ నా దృష్టిలో సైంటిస్ట్. మూడున్నర గంటలు కూర్చుని మేకప్ చేసుకోవడం, గంటన్నర దాన్ని తీయడానికి కేటాయించడం మరచిపోలేను’’ అని అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాగ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్ చేశారు. ముందు రీ–రికార్డింగ్‌ని కీబోర్డ్, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు.
చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్ కావాలని అనుకున్నా. అప్పుడే ‘రోబో’ సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక, ఆఫ్ సెట్, ఆన్ సెట్ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. ‘2.0’కి పనిచేసిన అను భవం 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది’’ అని అన్నారు. రసూల్ పూకుట్టి మాట్లాడుతూ – ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ సాయం మర్చిపోలేం. ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. ఇంత గొప్ప అచీవ్‌మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కన్నడ నటులు ఉపేంద్ర, శివరాజ్‌కుమార్‌లతో పాటు పలువురు ప్రముఖులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయగా, చిత్రబృందం సమాధానాలిచ్చింది. అలాగే నటుడు కమల్‌హాసన్ వీడియో ద్వారా తన అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment