వ్యక్తిపూజకు దూరంగా ఉండండి
విజయంతో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వొద్దు
నియోజకవర్గాలను తరచూ సందర్శించండి
కష్టపడి పనిచేసి 2019లో మళ్లీ గెలవండి
బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గదర్శనం
న్యూఢిల్లీ: వ్యక్తిపూజకు దూరంగా ఉండాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. తనతోపాటు ఇతరుల పాదాలకు మొక్కే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. వ్యక్తి పూజను తాను ఆమోదించనని, దానికి బదులు పార్లమెంటు సభ్యులుగా కష్టపడి పనిచేయాలని హితవు పలికారు. శుక్రవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అగ్రనేతలు అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలకు మోడీ మార్గనిర్దేశం చేశారు. 20 నిమిషాల ప్రసంగంలో... తగిన అధ్యయనం, ప్రవర్తన, సత్సంబంధాలపై దృష్టి సారించాలని మోడీ ఎంపీలకు గీతోపదేశం చేశారు.
విజయంతో నిర్లక్ష్యానికి అవకాశమివ్వకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సందేశాలను క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేయాల్సిన గురుతర బాధ్యత ఎంపీలపై ఉందని స్పష్టమైన సందేశమిచ్చారు.వినయంగా ఉండాలని, నియోజకవర్గాలను తరచూ సందర్శించాలని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసి 2019లో మళ్లీ ఎన్నికవ్వాలని వారికి లక్ష్యాన్ని నిర్దేశించారు.
పార్లమెంటు సమావేశాలకు సజావుగా హాజరై, సమావేశా లు సాఫీగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు.పార్లమెంటులో జరిగే చర్చల్లో పాల్గొనే ముందు సంబంధిత అంశాలపై తగినంత అధ్యయనం చేసి రావాలని కోరారు. చర్చల్లో పాల్గొనడం ద్వారా అనుభవాన్ని గడించవచ్చని పేర్కొన్నారు.మీడియాతో పార్టీ ప్రతినిధులుగా మాట్లాడవద్దని, దానికి బదులు తమ ప్రాంత, నియోజకవర్గ అంశాలపై మాట్లాడాలని సూచించారు.అగ్రనేత అద్వానీ మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కోసం పనిచేయడాన్ని ఇక ముందూ కొనసాగించాలని సూచించారు. 2 ఎంపీ స్థానాల నుంచి 282 ఎంపీ స్థానాలకు పార్టీ సాధించిన ప్రగతిని నిలబెట్టాలని, చెడ్డపేరు తేవద్దని కోరారు. మరింత కష్టపడి పనిచేయాలని రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు.
తొలి విదేశీ పర్యటన భూటాన్‌లో!
నూతన ప్రధాని నరేంద్రమోడీ తొలి విదేశీ పర్యటన కింద భూటాన్‌కు ఈ నెలాఖరులో వెళ్లనున్నారు. ఆ తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్య దేశం జపాన్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత ప్రధాని బ్రెజిల్, అమెరికా పర్యటనలు ఉంటాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. అలాగే, బ్రిక్స్ సమావేశం కోసం జూలై మధ్య భాగంలో బ్రెజిల్‌కు వెళ్లనున్నారని చెప్పారు. ఇక, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారని, ఈ విషయమై ఇరువురికీ ఆమోదయోగ్యమైన తేదీపై అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.