మూల్యం తప్పదు: శివసేన
పాక్ గడ్డను ముద్దాడితే..వాజ్‌పేయి, అద్వానీలకూ అదే గతి పట్టింది
‘సామ్నా’లో చురకలు
ముంబై: ఎన్డీఏ భాగస్వామి శివసేన మరోసారి ప్రధానిపై ధ్వజమెత్తింది. పాకిస్తాన్ గడ్డను ముద్దాడినందుకు మోదీ భారీ మూల్యం చెల్లించకతప్పదని మండిపడింది. పాక్‌కు దగ్గరయ్యేందుకు యత్నించిన వాజ్‌పేయి, అద్వానీ లాంటి బీజేపీ అగ్రనేతల రాజకీయ గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో మోదీ గుర్తుంచుకోవాలంది. ‘ఎల్‌కే అద్వానీ ఒకసారి ముహమ్మద్ అలీ జిన్నా సమాధి వద్దకు వెళ్లి ఆయనను కీర్తించారు. ఆ తర్వాతే అద్వానీ రాజకీయ గ్రాఫ్ పతనం ప్రారంభమైంది.’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది. ‘ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి లాహోర్ బస్సు దౌత్యం నెరిపారు. ఆ దేశ మాజీ నియంత ముషార్రఫ్‌తో ఆగ్రాలో చర్చలు జరిపారు.
ఆ తర్వాత వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ ఎన్నడూ అధికారంలోకి రాలేదు’ అని శివసేన పేర్కొంది. అయితే కాంగ్రెస్ ప్రధాని ముందస్తుగా ప్రకటించకుండా పాకిస్తాన్‌కు వెళ్తే బీజేపీ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని ఉందని తెలిపింది. మోదీ మాదిరి కాంగ్రెస్ ప్రధాని కూడా అకస్మాత్తుగా లాహోర్‌కు వెళ్తే బీజేపీ ఇలాగే స్వాగతిస్తుందా అని యావద్దేశం ప్రశ్నిస్తోందని చెప్పింది. పాక్ గడ్డ శాపగ్రస్తమైందని, దాన్ని ముద్దాడినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని, ఎందుకంటే లక్షలాది మంది అమాయక భారతీయుల నెత్తురు రగిలిపోతుందని పేర్కొంది.