భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు | Asia will have a better future if India, China work together | Sakshi
Sakshi News home page

వైరంతో వెనకబడిపోతాం

Published Sat, Jun 2 2018 3:58 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

Asia will have a better future if India, China work together - Sakshi

నన్యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ఎగ్జిబిషన్‌లో రోబోతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

సింగపూర్‌: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్‌ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి–లా అనే హోటల్‌లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్‌ ప్రాంతాన్ని భారత్‌ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్‌గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్‌ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్‌ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్‌ అధ్యక్షురాలు హలీమా యాకూబ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ
సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని  మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నన్యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(ఎన్‌టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఆసియా త్రూ ఇన్నోవేషన్‌’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే..
‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్‌ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్‌ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది.  సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్‌టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు.

లూంగ్‌కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం..
చర్చల సందర్భంగా లూంగ్‌కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్‌ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్‌ మాజీ రాయబారి టామీ కోహ్‌(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్‌ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్‌ ఒకరు. కోహ్‌ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు.

8 ఒప్పందాలపై సంతకాలు
ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్‌ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్‌ ప్రధాని  లూంగ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్‌ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్‌ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement