
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్- చైనా మంత్రి వాంగ్ యీ(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల అంశంలో చైనా ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి డ్రాగన్ చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలు అని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్-చైనా దౌత్య బంధానికి డెబ్బై ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉమ్మడిగా స్మారక స్టాంపులు విడుదల చేసే విషయంపై గతేడాది డ్రాగన్ దేశంతో ఒప్పందం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఈ కార్యక్రమ ఆరంభోత్సవం గురించి చైనీస్ అధికారులతో ఎటువంటి చర్చ జరుగలేదు. కానీ భారత్ నుంచి సరైన స్పందన లేనందు వల్లే దీనిని రద్దు చేసినట్లు చైనా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఇది ఈ ట్వీట్ సరైంది కాదు. పూర్తిగా అవాస్తవం’’ అని పేర్కొన్నారు.(చదవండి: భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి: చైనా)
అదే విధంగా.. ‘‘నిజానికి ఇంతవరకు 70వ వార్షికోత్సవానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు మొదలుకాలేదు. అలాంటప్పుడు ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ అనే ప్రస్తావన ఎలా వస్తుంది’’ అని అనురాగ్ శ్రీవాస్తవ డ్రాగన్ తీరును ఆక్షేపించారు. కాగా బ్యూటిఫుల్ ఇండియా, బ్యూటిఫుల్ చైనా పేరిట మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభవోత్సవంలో చైనా రాయబారి సన్ వెడాంగ్ పాల్గొన్న నేపథ్యంలో స్టాంపుల విడుదలకు సంబంధించి వివాదం చెలరేగింది. వార్షికోత్సవ వేడుకలకు ఇది ఆరంభమని ఆయన పేర్కొనగా.. భారత్ మాత్రం వేడుకలు ఇంకా మొదలుకాలేదని పేర్కొంది. ఇక గల్వాన్‌లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి సుమారు 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయేలా ఇప్పటికే పలుమార్లు దైత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి.