వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మోదీ పర్యటన భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడిని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా రక్షణ సహకారం, భారత్‌లో స్వదేశీ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతి విషయంలో భారీ, చరిత్రాత్మక, ఉత్తేజభరిత ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటన ప్రారంభిస్తారు.
నాలుగు రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఈ నెల 22న ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. మోదీ రాకవల్ల భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి (ఇండో–పసిఫిక్ భద్రతా వ్యవహారాలు) ఎలీ రట్నార్ చెప్పారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక సందర్భం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment