
కెనడాలో భారత హై కమిషనర్ దినేష్ కుమార్ పట్నాయక్!
పట్టాలెక్కనున్న దౌత్య సంబంధాలు
కెనడాలో మార్క్ కార్నీ మైనారిటీ ప్రభుత్వం!
భారత్-కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా... అంటే అవుననే చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత, ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని, కాబోయే పూర్తికాలపు ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. మార్క్ కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబరులో రెండు దేశాలూ పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి.
ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పెయిన్’లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ ను కెనడాలో తదుపరి హై కమిషనరుగా భారత్ నియమించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. కెనడా ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రావాలంటే లిబరల్ పార్టీ 172 సీట్లు గెలవాలి. కానీ ఆ మేజిక్ నంబరుకు కొద్ది దూరంలో అది ఆగిపోయింది.
చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశముంది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హరదీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత ప్రభుత్వ ఏజెంట్లే అతడిని హతమార్చారని కెనడా ఆరోపించడంతో ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుంచి దిగిపోయారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ సానుకూల నేత, న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ రెండు పరిణామాలు ఇండో-కెనడా బంధం మళ్లీ మొగ్గ తొడిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చాయి. ట్రూడోలా కాకుండా మార్క్ కార్నీ మరింత పరిణతితో వ్యవహరిస్తారని భారత్ అభిప్రాయపడుతోంది.
- జమ్ముల శ్రీకాంత్