దేశ ప్రయోజనాలే ముఖ్యం | Mike Pompeo meets PM Narendra Narendra Modi | Sakshi
Sakshi News home page

దేశ ప్రయోజనాలే ముఖ్యం

Published Thu, Jun 27 2019 3:39 AM | Last Updated on Thu, Jun 27 2019 4:53 AM

Mike Pompeo meets PM Narendra Narendra Modi - Sakshi

భారత్‌–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో

న్యూఢిల్లీ: రక్షణ, ఇంధనం, వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు సహా వేర్వేరు రంగాల్లో భారత్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సమర్థతను ఆయన కొనియాడారు. ఇరాన్‌ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనీ, దీనిపై అమెరికా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకున్న పాంపియో ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌తో సమావేశమయ్యారు.

మాకోసం భారత్‌ చాలా చేసింది
పాంపియోతో భేటీ సందర్భంగా జైశంకర్‌ స్పందిస్తూ.. ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనలను కొట్టిపడేశారు. ‘రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్‌ కాట్సా చట్టం (కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ త్రూ శాంక్షన్‌ యాక్ట్‌) తెచ్చింది. దీని కారణంగా భారత్‌పై కూడా ప్రభావం పడుతోంది. భారత్‌కు రష్యా సహా పలుదేశాలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అమెరికా వీటిని గౌరవించాలి’ అని సూచించారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.

వెంటనే పాంపియో స్పందిస్తూ..‘మా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్, వెనిజులా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌ వెనక్కుతగ్గింది. ఇది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఇండియాకు ఇంధన కొరత రాకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇరాన్‌ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. హోర్ముజ్‌ జలసంధిలో చమురు నౌకలపై ఇరానే దాడిచేసింది. ఈ విషయంలో అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్‌–అమెరికాలు నిర్ణయించాయి’ అని పేర్కొన్నారు.

వాణిజ్యంపై ఏకాభిప్రాయం అవసరం
అమెరికా, భారత్‌ల మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధంపై పాంపియో మాట్లాడారు. ‘పరస్పర సుంకాలను విధించుకోవడంపై భారత్‌–అమెరికాలు ఓ అంగీకారానికి రాగలవు. కానీ మనం కూడా అవతలివారి కోణం నుంచి ఆలోచించినప్పుడు బంధాలు బలపడతాయి. భారత్‌ తన సమగ్రతను కాపాడుకునేందుకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు, రక్షణ అవసరాలను తీర్చేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. వాణిజ్యం విషయంలో భారత్‌–అమెరికాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని జైశంకర్‌ కూడా అంగీకరించారు. వాణిజ్య భాగస్వాములు అన్నాక పరిష్కరించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయన్నారు.

మతస్వేచ్ఛ లేకుంటే వినాశనమే..
మతస్వేచ్ఛను కాలరాస్తే ప్రపంచం దారుణంగా తయారవుతుందని మైక్‌ పాంపియో హెచ్చరించారు. భారత్‌లో ఇటీవలికాలంలో మైనారిటీలపై హిందుత్వ మూకల దాడులు పెరిగిపోయిన విషయాన్ని పాంపియో పరోక్షంగా ప్రస్తావించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలకు భారత్‌ పుట్టినిల్లు. కాబట్టి మతస్వేచ్ఛకు అందరం మరోసారి కంకణబద్ధులం అవుదాం. జైషే అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోంది. అమెరికా తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు అంతర్జాతీయ వేదికలపై భారత్‌ మద్దతు పలుకుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి అమెరికా కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేశారు. మరోవైపు జపాన్‌లోని ఒసాకాలో జూన్‌28–29 తేదీల్లో జరిగే జీ–20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ తెలిపారు.  

భేటీ సందర్భంగా పాంపియోతో జైశంకర్‌ కరచాలనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement