Religious Freedom
-
హిజాబ్ వ్యవహారం మా అంతర్గతం: భారత్
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛ(ఐఆర్ఎఫ్) సంఘంలో అమెరికా ప్రతినిధి రషద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంది. దీనిపై కొన్ని దేశాలు చేసిన విమర్శలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం తిప్పికొట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు అవసరమైన వ్యవస్థలు, యంత్రాంగం తమకు ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని ఓ కుట్రగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభివర్ణించారు. సుప్రీంలో పిల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థల్లోనూ ఉమ్మడి డ్రెస్ కోడ్ అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై హిజాబ్ గురించి అభ్యంతరకరంగా రాశారంటూ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. దీనికి బాధ్యురాలిగా ఓ టీచర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. -
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
బెళగావి(కర్ణాటక): వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసన సభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా ‘కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు–2021’ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జేడీ(ఎస్) సైతం బిల్లును తప్పుబట్టింది. ఈ తరహా చట్టం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి పేర్కొన్నారు. బిల్లు.. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్భలంతో, తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడిలను అడ్డుకుంటుంది. చట్టవ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. -
హిందూ, క్రైస్తవ స్త్రీలను చైనాకు ఉంపుడుగత్తెలుగా...
ఇస్లామాబాద్: భారతదేశంలో మైనారిటీల హక్కుల గురించి మొసలి కన్నీరు కార్చే పాకిస్తాన్ తన దేశంలోని మైనారిటీలైన హిందూ, క్రైస్తవుల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోదు. ఈ క్రమంలో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ బ్రౌన్బ్యాక్ సంచలన విషయాలు వెల్లడించారు. పాక్‌లోని హిందూ, క్రైస్తవ యువతులను చైనాకు బలవంతపు పెళ్లికూతుళ్లుగా.. ఉంపుడుగత్తెలుగా ఎగుమతి అవుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు జరగనున్న వెబినార్ చాలా క్లిషమైనది. చైనాకు పంపబడుతున్న బలవంతపు వధువులకు సంబంధించినది ఈ వెబినార్. పాకిస్తాన్ తన దేశంలోని మైనారిటీలైన క్రైస్తవులు, హిందూ యువతులను ఉంపుడుగత్తెలు, బలవంతపు వధువులుగా చైనాకు అమ్ముతుంది. ఎందుకంటే ఆ దేశంలో వీటిపై ఎవరు నోరు మెదపరు. మతపరమైన మైనారిటీలపై పాక్‌లో వివక్ష ఉంది. ఇది వారికి మరింత హానీ చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్తాన్‌ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా (సీపీసీ) నియమించడానికి ఇది ఒక కారణమని’ ఆయన పేర్కొన్నారు. (పాక్‌ను ఆ లిస్టులోంచి తీసేయండి: టర్కీ) దశాబ్దాలుగా చైనా విధించిన వన్-చైల్డ్ విధానం, అబ్బాయిలకు సాంస్కృతికంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం డ్రాగన్ దేశంలో మహిళల కొరత ఉంది. దాంతో చైనా పురుషులు ఇతర దేశాల మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు, కార్మికులుగా దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి పాంపియో పాకిస్తాన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎందుకు అనే ప్రశ్నకు బ్రౌన్బ్యాక్ ప్రతిస్పందించారు. “పాకిస్తాన్లో మతపరమైన హింస చెలరేగినప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో చాలా మత ఘర్షణలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమర్థవంతమైన పోలీసు, న్యాయపరమైన చర్యలు అమలు జరిగియా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి మేము ప్రయత్నిస్తాము’’ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మతభ్రష్టుడు, దైవదూషణ కారణంగా బంధించబడి జైళ్లో ఉన్న జనాభాలో సగం మంది పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గుతున్నారని బ్రౌన్బ్యాక్ వెల్లడించారు. (చదవండి: కామాంధులపై పాక్ సర్కారు ఉక్కుపాదం!) అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం "మత స్వేచ్ఛ పరంగా క్రమబద్ధమైన, కొనసాగుతున్న, అతిగా ఉల్లంఘనలకు" పాల్పడటం వంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న చైనా, పాక్‌తో సహా 8 దేశాలను సందర్శించారు. యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (యూఎస్సీఐఆర్ఎఫ్) భారతదేశాన్ని కూడా ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా (సీపీసీ) నియమించాలని విదేశాంగ శాఖకు సిఫారసు చేసింది. కానీ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సిఫారసును అంగీకరించలేదు. యూఎస్సీఐఆర్ఎఫ్ దేశానికి వ్యతిరేకంగా చేసిన పరిశీలనలను భారతదేశం తన వార్షిక నివేదికలో తిరస్కరించింది. పాంపియో పాకిస్తాన్‌తో పాటు, చైనా, మయన్మార్ ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లను కంట్రీ ఆఫ్ పర్టిక్యూలర్ కన్సర్న్(సీపీసీ)జాబితాలో చేర్చారు. -
భారత్‌లో మతస్వేచ్ఛ; అమెరికా ఆందోళన
వాషింగ్టన్: యుగాలుగా అన్ని పరమత సహనం పాటిస్తూ వచ్చిన భారతదేశంలో మతస్వేచ్ఛ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు అమెరికా దౌత్యవేత్త సామ్యూల్ బ్రౌన్‌బాక్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మతస్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలను రికార్డు చేసి తయారు చేసిన ‘2019 అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం విడుదల చేశారు. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్ సోదరుడి ఆవేదన) ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే ‘ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్’ సంస్థకు అంబాసిడర్ అట్‌లార్జ్‌గా వ్యవహరిస్తున్న సామ్యూల్ బ్రౌన్‌బాక్ కొంతమంది విదేశీ విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘భారత్‌లో పరిణామాలు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నాయి. మేము ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులను చక్కదిద్దడానికి ఉన్నత స్థాయిలో భారత్ అంతర్గత చర్చలు ప్రారంభించాలి. మత స్వేచ్ఛపై భారత్ ప్రధానంగా దృష్టి సారించకపోతే హింస మరింతగా పెరిగి విపరిణామాలకు దారితీస్తుంద’ని సామ్యూల్ బ్రౌన్‌బాక్ అన్నారు. గతంలోనూ అమెరికా ఇదే తరహా ఆరోపణ చేయగా భారత్ దాన్ని తిరస్కరించింది. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్) -
ప్రభుత్వం మౌనం వీడాలి..
సాక్షి, హైదరాబాద్: ‘మత స్వేచ్ఛ ముసుగులో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోకూడదు. రాష్ట్రానికి మౌనం ఎంత మాత్రం తగదు. ప్రభుత్వం నిశ్శబ్దాన్ని వీడాలి. ప్రేక్షకపాత్ర పోషిస్తామంటే హైకోర్టు చూస్తూ కూర్చోదు. మత విశ్వాసాల పేరుతో ప్రార్థనా మందిరాలను అక్రమంగా నిర్మిస్తే అడ్డుకునేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలుండాలి. మతపరమైన ఆక్రమ కట్టడాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోకపోతే రేపు మసీదులు, చర్చిలు, గురుద్వార్ వంటివి కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తాయి..’అని హైకోర్టు తీవ్రస్వరంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో మాధవపురి హిల్స్‌లోని రాక్ గార్డెన్స్ పార్క్‌లో 9,866 చదరపు గజాల్లో ఆలయాన్ని నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ 2018లో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ పిల్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలోని ఆదేశాల మేరకు పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్ సుల్తానియా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులు విచారణకు స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ధర్మాసనం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక దశలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారణకు హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక నిమి త్తం అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పా టు చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? ‘దేవుడు కూడా చట్టానికి అతీతుడు కాడని నిరూపించేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన, స్పష్టమైన విధాన నిర్ణయాన్ని అమలుచేయాలి. రాష్ట్రం మౌనంగా ఉంటే.. కళ్లు తెరిచి చూస్తూనే తమకేమీ పట్టనట్లుగా ఉంటే.. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు అక్రమంగా ప్రార్థనా మందిరాల నిర్మాణాలు చేసుకుంటూ పోతే.. రేపు రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? ఆ మతం ఈ మతం అనే తారతమ్యం లేకుండా అక్రమ ప్రార్థనా మందిరాల్ని కూల్చేయాల్సిన పరిస్థితులున్నాయి. రాజస్తాన్‌లో ఆ తరహా విధానాన్ని అమలు చేసినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపేలా కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఈ ప్రక్రియ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి మొదలుపెట్టండి. అక్రమ కట్టడాలను సంప్రదింపుల ద్వారా తొలగిస్తామంటే మత విశ్వాసాలున్న ప్రజలు ఒప్పుకోరు. అందుకే ప్రభుత్వం 2010 మార్చి 31న జారీ చేసిన జీవో 262ను అమలు చేసే దిశగా అధికారులు అడుగులు వేయాలి. జీవో జారీ చేసేనాటికే 2,224 ప్రార్థనా మందిరాలను అక్రమంగా నిర్మించినట్లు ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేనట్లుగానే అఫిడవిట్ ఉంది. అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఏం సంకేతాలు పంపుతున్నట్లు..? ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగిపోతున్నట్లుగా అనిపిస్తోంది..’అని ధర్మాసనం పేర్కొంది. ఇంత నిర్లక్ష్యంగా అఫిడవిట్టా? ప్రభుత్వ అఫిడవిట్ చూస్తే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. ప్రమాణం చేసి దాఖలు చేసే అఫిడవిట్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక లేదు. అమీన్పూర్ తహసీల్దార్.. కలెక్టర్‌కు ఇచ్చిన రిపోర్టులో ఏముందో కూడా లేదు. అమీన్పూర్ ఆలయ సముదాయం విషయంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆలయ కమిటీ సంగారెడ్డి కోర్టును ఆశ్రయిస్తే.. ఆ కోర్టులో కేసు ఏ స్థితిలో ఉందో కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొనలేదు. పైగా, ఈ కేసులో ఎవరినీ ప్రాసిక్యూట్ చేయబోమని పోలీసులు చెప్పడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదు. మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు చెప్పినట్లుగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం శోచనీయం. 2014లో ఆలయ సముదాయాన్ని నిర్మిస్తే 2017, 2020 సంవత్సరాల్లో రెండు నోటీసులు మాత్రమే ఇచ్చారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఒక్క ఆలయం విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో ఆచరణలో చూపించి మొత్తం రాష్ట్రానికి సంకేతాలివ్వండి..’అని ధర్మాసనం పేర్కొంది. వెంటనే ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి కల్పించుకుని అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటామని, పూర్తి వివరాలతో మళ్లీ అఫిడవిట్ దాఖలు చేస్తామని కోరడంతో కోర్టు అనుమతించింది. భక్తుల పేరిట ఇంప్లీడ్‌కు నిరాకరణ ఆలయాన్ని 2010లోనే నిర్మాణం చేశామని, 2014లోనే ఆలయ నిర్మాణానికి హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఆలయ కమిటీ తరఫు న్యాయవాది చెప్పారు. ఇంతవరకూ ఆలయ కమిటీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదంటే మీకు ఆధ్యాత్మిక చింతన ఎంత ఉందో, చిత్తశుద్ధి ఎంత ఉందో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. భక్తుల తరఫున కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని మరో న్యాయవాది ఉమేశ్ చంద్ర చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అడ్వొకేట్ కమిషన్ ఏర్పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదిక కోసం న్యాయవాది నూకల ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ప్రతినిధిగా ప్రవీణ్‌రెడ్డి పర్యటిస్తారనే విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ గుర్తుంచుకోవాలని స్పష్టంచేసింది. ప్రవీణ్‌రెడ్డికి భద్రత కల్పించేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫీజుల నిమిత్తం ఆలయ కమిటీ ప్రవీణ్‌రెడ్డికి రూ.50 వేలు చెల్లించాలని పేర్కొంది. ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో పాటు దాని ప్లాన్, ఇతర పత్రాలను అడ్వొకేట్ కమిషన్‌కు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 13నాటికి అడ్వొకేట్ కమిషన్ నివేదిక సమర్పించాలని పేర్కొంది. 2010 నాటి జీవో 262లో 6,707 అక్రమ నిర్మాణాల్లో మతపరమైనవి 2,224 ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పటివరకూ అటువంటి నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో సమగ్రంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్లో తెలపాలని ఆదేశిస్తూ కోర్టు విచారణ వాయిదా వేసింది. పదేళ్ల క్రితమే జీవో జారీ అయినా.. ప్రార్థనా మందిరాల అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ చెప్పారు. జీవో 262లో 3 తరగతులుగా వర్గీకరణ చేశారని, ఇటీవలే నిర్మాణం చేసిన ప్రార్థనా మందిరాలను తక్షణమే తొలగించడం, కొంచెం పాత ప్రార్థనా మందిరాలను స్థానికుల సాయంతో తొలగించడం, బాగా పాత ప్రార్థనా మంది రాలు, భక్తుల మనోభావాలున్న వాటి విషయంలో అందరితో సంప్రదింపులు చేసి ఏకాభిప్రాయంతో తొలగింపు చర్యలు తీసుకోవడమని ఆయన వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. జీవో జారీ చేసి పదేళ్లు అయిందని, ఇప్పటివరకూ ఏం చేశారని ప్రశ్నించింది. పదేళ్లల్లో అక్రమ ప్రార్థనా మందిరాలు ఎన్ని పెరిగాయని, వాటిలో ఎన్నింటిని కూల్చారని నిలదీసింది. జీవోను పదేళ్లల్లో తొలిసారి సమీక్ష చేస్తున్నామని ఆయన చెప్పడంతో..ఏడాదికి ఒకసారైనా సమీక్ష చేయకపోతే 2030 వరకూ మళ్లీ సమీక్షే ఉండకపోవచ్చునని వ్యాఖ్యానించింది. -
దేశ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రక్షణ, ఇంధనం, వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు సహా వేర్వేరు రంగాల్లో భారత్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సమర్థతను ఆయన కొనియాడారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనీ, దీనిపై అమెరికా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకున్న పాంపియో ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. మాకోసం భారత్ చాలా చేసింది పాంపియోతో భేటీ సందర్భంగా జైశంకర్ స్పందిస్తూ.. ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనలను కొట్టిపడేశారు. ‘రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్ కాట్సా చట్టం (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్) తెచ్చింది. దీని కారణంగా భారత్‌పై కూడా ప్రభావం పడుతోంది. భారత్‌కు రష్యా సహా పలుదేశాలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అమెరికా వీటిని గౌరవించాలి’ అని సూచించారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వెంటనే పాంపియో స్పందిస్తూ..‘మా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్, వెనిజులా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ వెనక్కుతగ్గింది. ఇది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఇండియాకు ఇంధన కొరత రాకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై ఇరానే దాడిచేసింది. ఈ విషయంలో అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్–అమెరికాలు నిర్ణయించాయి’ అని పేర్కొన్నారు. వాణిజ్యంపై ఏకాభిప్రాయం అవసరం అమెరికా, భారత్‌ల మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధంపై పాంపియో మాట్లాడారు. ‘పరస్పర సుంకాలను విధించుకోవడంపై భారత్–అమెరికాలు ఓ అంగీకారానికి రాగలవు. కానీ మనం కూడా అవతలివారి కోణం నుంచి ఆలోచించినప్పుడు బంధాలు బలపడతాయి. భారత్ తన సమగ్రతను కాపాడుకునేందుకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు, రక్షణ అవసరాలను తీర్చేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. వాణిజ్యం విషయంలో భారత్–అమెరికాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని జైశంకర్ కూడా అంగీకరించారు. వాణిజ్య భాగస్వాములు అన్నాక పరిష్కరించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయన్నారు. మతస్వేచ్ఛ లేకుంటే వినాశనమే.. మతస్వేచ్ఛను కాలరాస్తే ప్రపంచం దారుణంగా తయారవుతుందని మైక్ పాంపియో హెచ్చరించారు. భారత్‌లో ఇటీవలికాలంలో మైనారిటీలపై హిందుత్వ మూకల దాడులు పెరిగిపోయిన విషయాన్ని పాంపియో పరోక్షంగా ప్రస్తావించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలకు భారత్ పుట్టినిల్లు. కాబట్టి మతస్వేచ్ఛకు అందరం మరోసారి కంకణబద్ధులం అవుదాం. జైషే అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోంది. అమెరికా తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు అంతర్జాతీయ వేదికలపై భారత్ మద్దతు పలుకుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి అమెరికా కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేశారు. మరోవైపు జపాన్‌లోని ఒసాకాలో జూన్28–29 తేదీల్లో జరిగే జీ–20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. భేటీ సందర్భంగా పాంపియోతో జైశంకర్ కరచాలనం -
అమెరికా నివేదికపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానిం చింది. 2018లో అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా ప్రభుత్వం శుక్రవారం నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. గోమాంసాన్ని రవాణా చేయడం, గోవధ చేశారనే ఆరోపణలతో ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిన అంశాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఖండించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోని లౌకిక భావజాలం పట్ల భారత్ గర్విస్తోంది. ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇక్కడి ప్రజలందరికీ మత స్వాతంత్య్రం ఉంది. రాజ్యాంగం మైనారిటీలు సహా అన్ని వర్గాలకు హక్కులను కల్పిస్తోంది. ఎవరికీ ఎలాంటి హానీ కలగదు. ఈ విషయంలో విదేశీ ప్రభుత్వం జోక్యం తగదు’అని ఉద్ఘాటించారు. -
‘అమెరికా గతాన్ని మర్చిపోయింది’
ఇస్లామాబాద్ : అమెరికాపై పాకిస్తాన్ ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తోంది. అగ్రరాజ్యం బెదిరింపులు లొంగేది లేదని... పాక్ మరోసారి స్పష్టం చేసింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు, ఉగ్రవాదం వంటి అంశాలపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై పొరుగుదేశం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. వాషింగ్టన్‌నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని పాటించలేమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా డెడ్లైన్లను విధించడం, బెదిరింపులకు దిగడం వంటివి ఇరుదేశాల సంబధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ఆయన చెప్పారు. పరస్పర గౌరవం, ఒకరిమీదొకరికి నమ్మకం, నిలకడ, ఓర్పు ఉన్నపుడే దౌత్యసంబంధాలు కొనసాగుతాయని.. అవి లేనప్పుడు బంధం కొనసాగడంలో అర్థం లేదని చెప్పారు. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాకు పాక్ సహకరించిందని.. మా దేశం ఎవరిమీద సమయం చేయలేదన్న విషయానని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. అమెరికా భద్రత కోసం మేం ప్రయత్నించాము.. మా రక్షణ కోసం వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. ఆల్‌ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయడంతో మేం చేసిన సహాయాన్ని అమెరికా మర్చిపోయిందని ఆయన అన్నారు. మత స్వేచ్ఛకు ఇబ్బంది లేదు: మత స్వేచ్ఛ ఉల్లంఘనల విషయంలో అమెరికా పాకిస్థాన్‌ను ‘ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన జాబితా’లో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై డాక్టర్ ముహమ్మద్ ఫైజల్ అసహనం వ్యక్తం చేశారు. ఏఏ కారణాలతో పాకిస్తాన్‌ను ఈ జాబితాలో చేర్చారో చెప్పాలని ఆయన అన్నారు. మా దేశంలో మత స్వేచ్ఛ ఉంది.. అందువ్లలే అందరూ ఉండగలుగుతున్నారని చప్పారు. ఇదిలావుండగా.. మత స్వేచ్ఛ ఉల్లంఘనల అంశంలో 10దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ‘ప్రత్యేక ఆందోళనకర దేశాలు’గా హోదా మార్చారు. -
ప్రమాదంలో మత స్వేచ్ఛ
వాషింగ్టన్: 2016లో భారత్‌లో మతపర స్వేచ్ఛ, సహనం క్షీణించాయని అమెరికాకు చెందిన సంస్థ ఒకటి వెల్లడించింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు అధికంగా ఉన్న 12 దేశాల జాబితాలో భారత్‌నూ చేర్చింది. మైనారిటీలు, దళితులపై హిందూ జాతీయవాదులు, వారి సానుభూతిపరులు లెక్కలేనన్ని సార్లు బెదిరింపులు, హింస, వేధింపులకు పాల్పడ్డారని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. భారత్‌లో పది రాష్ట్రాల్లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయని తెలిపింది. మత మార్పిళ్లు, గోవధ, స్వచ్ఛంద సేవా సంస్థలకు విదేశీ నిధులపై ఆంక్షలు, సిక్కులు, బౌద్ధులు, జైనులను హిందువులుగా చూపుతున్న రాజ్యాంగ నిబంధనల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడించింది. ‘ప్రధాని మోదీ మతపర సహనం, మత స్వేచ్ఛ ప్రాముఖ్యం గురించి బహిరంగంగా బాగానే మాట్లాడుతున్నా... అధికార పార్టీకి చెందిన వారు మాత్రం, హింసకు కారణమవుతున్న హిందూ జాతీయవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారు’ అని ఆరోపించింది. మైనారిటీలు భారత్‌లో అభద్రతకు లోనవుతున్నారని, మతపర నేరాలు జరిగినపుడు వారికి పరిష్కార మార్గం కనిపించడంలేదంది. భారత్‌తో ద్వైపాక్షిక చర్చల్లో మత స్వేచ్ఛపై నెలకొన్న ఆందోళనలనూ చేర్చాలని అమెరికా ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది. -
ఆ నాలుగు ఉల్లంఘనలే భారత్‌లో అత్యధికం
వాషింగ్టన్: విదేశీ నిధులు పొందే ఎన్జీవోలపై నిషేధం, మత స్వేచ్ఛ, అవినీతి, పోలీసు, భద్రతా దళాల వేధింపులే భారత్‌లో ముఖ్యమైన మానవహక్కుల ఉల్లంఘనలని అమెరికా ప్రభుత్వ నివేదిక ఒకటి స్పష్టం చేస్తోంది. అదృశ్యమైపోవడం, ఘోరమైన జైళ్లు, న్యాయ విచారణలో విపరీతమైన జాప్యం వంటి హక్కుల ఉల్లంఘనలు భారత్‌లో ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలో మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా 6 రాష్ట్రాల్లో మత మార్పిళ్లపై నిషేధం విధించారని ఈ నివేదిక తెలిపింది. దివ్యాంగులు, ఆదివాసీల పట్ల దేశంలో తీవ్రవివక్ష ఉందని తన నివేదికలో తెలిపింది. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలపై ప్రభుత్వ స్పందన నామమాత్రంగానే ఉందని పేర్కొంది. చిన్నారులపై అఘాయిత్యాలు, బాల్యవివాహాలు, పిల్లల అక్రమరవాణా భారత్ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలని తేల్చింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో అలసత్వం, బాధ్యతారాహిత్యం విలయతాండవం చేస్తున్నాయని తెలిపింది. -
భారత్‌లో అసహనంపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్ : భారత్‌లో అసహనం, హింస పెరుగుతున్నట్లు వస్తున్న నివేదికలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత ప్రభుత్వం తన పూర్తి అధికారాలను ఉపయోగించి పౌరులకు రక్షణ కల్పించాలని, వీటికి కారణమవుతున్న దోషులను శిక్షించాలని కోరింది. భారత్‌లో బీఫ్ తినేవారిపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవల మధ్యప్రదేశ్‌లో గేదె మాంసం తీసుకెళుతున్న ఇద్దరు ముస్లిం మహిళలపై వేధింపులు జరిగినట్లు వచ్చిన నివేదికపై విదే శాంగ ప్రతినిధి జాన్ కిర్బీ పైవిధంగా స్పందించారు. భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ విషయంలో భారతీయులకు, ప్రభుత్వానికి తాము మద్దతుగా నిలుస్తామని, అలాగే అన్ని రకాల హింసలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తాము అండగా ఉంటామని ఆయన అన్నారు. భారతీయుల్లో ఉన్న సహనాన్ని వారికి తెలియజేసేందుకు వారితో కలసి పనిచేస్తామని కిర్బీ స్పష్టంచేశారు. -
నివేదిక... నిజానిజాలు
అభిప్రాయాలుండటం తప్పు కాదు. ప్రపంచంలో ఏ మారుమూలైనా సరే జరగరానిది జరుగుతున్నదని అనుకున్నప్పుడు ఆందోళనపడటం, కలవరపాటుకు లోనవడం నేరమేమీ కాదు. అమెరికా కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) కూడా ఇలాంటి ఆందోళననూ, కలవరపాటునూ ఏటా ఒక నివేదిక ద్వారా వ్యక్తం చేస్తుంటుంది. పనిలో పనిగా పలు దేశాల గురించి తీర్పులిస్తుంటుంది. అయితే తననూ, తన ప్రియ మిత్రులైన పాశ్చాత్య దేశాలనూ మినహాయించుకుని నివేదిక రూపొందించడంతోనే ఎవరికైనా పేచీ వస్తుంది. తన వంతుగా నివేదిక విడుదల చేయడం తప్ప దాన్ని గురించి ఎలాంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయనే అంశంపై ఆ కమిషన్ దృష్టి పెట్టినట్టు లేదు. బహుశా అందువల్లే కావొచ్చు... ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నది. తాజాగా విడుదలైన కమిషన్ నివేదిక మన దేశంతోసహా చాలా దేశాల్లో మతపరమైన మైనారిటీలపై సాగుతున్న దాడుల గురించి, వాటి విషయంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావించింది. మన దేశంలోని స్థితిగతుల గురించి అయిదు పేజీల్లో వివరంగా చెప్పడంతోపాటు అఫ్ఘానిస్థాన్, రష్యా, టర్కీలతో సమం చేస్తూ ‘టైర్-2’ శ్రేణిలో చేర్చింది. 2009లో ఒడిశాలో క్రైస్తవులపై దాడులు జరిగినప్పటి నుంచీ భారత్ ఇదే శ్రేణిలో కొనసాగుతున్నది. ప్రస్తుత నివేదికలో ప్రస్తావించినవి అందరికీ తెలిసినవే. బీజేపీ నేతలు మైనారిటీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రార్థనా స్థలాలపై జరిగిన దాడులు, ఘర్‌వాపసీ వంటి కార్యక్రమాలు నివేదికలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చాయి. ఆ ఉదంతాలకు సంబంధించి మన మీడియాలో ఇప్పటికే విస్తృతంగా వార్తలు, కథనాలు, వ్యాసాలు వెలువడ్డాయి. చానెళ్లలో తీవ్రస్థాయి చర్చలు జరిగాయి. మత ప్రమేయం లేకుండా అందరూ ఆ ఉదంతాలను ఖండించారు. ఆందోళనపడ్డారు. కేంద్ర మంత్రులు ఒకరిద్దరు ఇవి తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని సంజాయిషీ ఇచ్చుకున్నా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వీటిపై ఒక ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఒక దశలో మోదీ కూడా జోక్యం చేసుకోవాల్సివచ్చింది. ఆయా మత నాయకులను పిలిచి ఇలాంటివి జరగనీయ బోమని హామీ ఇవ్వాల్సివచ్చింది. ఇవన్నీ సమస్య తీవ్రతను, అది సృష్టించిన ఆందోళనను తెలియజెప్పాయి. ఈమధ్యే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తుతూ ఆ దేశానికి చెందిన ‘టైమ్’ వారపత్రికలో పెద్ద వ్యాసం రాశారు. ‘వంద కోట్లమందికి పైగా ఉన్న భారతీయులు మోదీ నేతృత్వంలో కలిసిమెలిసి జీవిస్తుండటం, విజయాలు సాధిస్తుండటం స్ఫూర్తిదాయకమ’ని అందులో కీర్తించారు. ఇలా ‘ఉత్తేజభరితంగా, హృదయానికి హత్తుకునేలా’ రాసినందుకు నరేంద్ర మోదీ కూడా యథోచితంగా ఒబామాకు ధన్యవాదాలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి అభిప్రాయం ఉండగా యూఎస్సీఐఆర్ఎఫ్ మాత్రం...మోదీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలపై హింసాత్మక దాడులు చోటుచేసుకుంటు న్నాయనడం కాస్త గందరగోళపరిచే అంశమే. అంతకన్నా గందరగోళపరిచే అంశమేమంటే ఆ నివేదిక అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి మౌనంవహించడం.... అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశంగా ఉంటున్న సౌదీ అరేబియా వంటి దేశాల్లో చోటు చేసుకుంటున్న మత ఛాందసవాద ధోరణుల ఊసెత్తకపోవడం. ఇక్కడ మైనారిటీల్లో అభద్రతా భావన కలిగేలా సాక్షి మహరాజ్, సాధ్వి నిరంజనజ్యోతి వంటివారు మాట్లాడటం నిజమే అయినా...అమెరికాలోనూ కొందరు క్రైస్తవ ఛాందసవాదులు అచ్చం ఆ మాదిరిగానే ప్రసంగాలు చేస్తుంటారు. అలాంటివారిని కూడా ప్రస్తావించి ఖండిస్తే నివేదిక విలువ పెరిగేది. అమెరికాలో ఈమధ్య దేవాలయాలపై బెదిరింపు రాతలు రాయడం, గురుద్వారాలపై దాడులు వంటివి జరిగాయి. సిక్కు యువకులను హత్య చేయడం, పేరునిబట్టి ముస్లిం అని గుర్తిస్తే అలాంటివారి విషయంలో అతిగా వ్యవహరించడం వంటివి చోటు చేసుకున్నాయి. జాత్యహంకార దాడుల సంగతి చెప్పనవసరమే లేదు. వారిపై సాగుతున్న హింసాకాండ అక్కడ వ్యవస్థీకృతం అయిపోయింది. వరసగా నల్లజాతి యువకులపై అక్కడి పోలీసులు సాగిస్తున్న దాష్టీకంపై ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతుండగానే ఈమధ్యే బాల్టిమోర్‌లో ఒక యువకుణ్ణి అకారణంగా పొట్టనబెట్టుకున్నారు. సరిగ్గా నివేదిక విడుదల చేసే సమయానికి అమెరికాలోని ప్రధాన నగరాలతోపాటు పలు ప్రాంతాలు అగ్నిగుండాన్ని తలపించేలా భగ్గుమంటున్నాయి. కనీసం అందుకైనా జాత్యహంకార దాడులను ప్రస్తావించి ఉంటే... తమ దేశంలో మైనారిటీలకు నానాటికీ రక్షణ కరువవుతున్న అంశాన్ని తెలిపి ఉంటే ఆ నివేదికకు సాధికారత వచ్చేది. కమిషన్ అమెరికా కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే స్వతంత్ర సంస్థ అని చెబుతారు గనుక, అక్కడి పౌరులు పన్నుల ద్వారా చెల్లించే మొత్తంనుంచే దానికి నిధులు అందుతాయి గనుక ఆ సంస్థ పనితీరులో నిష్పాక్షికత కనబడాలని అందరూ ఆశిస్తారు. కమిషన్ నివేదికల విషయంలో మౌనంవహించే సంప్రదాయానికి భిన్నంగా మన దేశం ఈసారి స్పందించింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. నివేదికలో సంఘ్ పరివార్ సంస్థలపైనా, బీజేపీ నేతలపైనా నిశిత విమర్శలున్నాయి గనుక ఇలాంటి స్పందన వెలువడటంలో ఆశ్చర్యం లేదు. మత ఛాందసవాదాన్నీ, దాన్ని నెత్తినేసుకుని అన్యమతస్తులపై దాడులకు దిగేవారినీ ఏ మతస్తులూ అంగీకరించరు. అలాంటివారి మద్దతు పొందగలిగే రీతిలో మతస్వేచ్ఛ కమిషన్ పనితీరు ఉండాలి. పాక్షిక దృష్టితో వెలువరించే నివేదికలవల్ల ప్రయోజనం ఉండదు సరిగదా... చివరకు దెబ్బతినేది తన విశ్వసనీయత మాత్రమే. ఆ సంగతిని కమిషన్ గ్రహిస్తే మంచిది. -
స్కూల్లో యోగాకు అమెరికా కోర్టు సమర్థన
లాస్ఏంజెల్స్ : యోగా అనేది మతపరమైన కార్యక్రమం కాదు, శారీరక కసరత్తుగానే భావించాలంటూ లాస్ఏంజెల్స్ కోర్టు తీర్పునిచ్చింది. స్కూల్లో యోగా నేర్పించడం మతపరమైన హక్కులను ఉల్లంఘిచినట్టు కాదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. యోగాతో హిందూ, బౌద్ధ మతాలను ప్రోత్సహిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో అమెరికా స్కూళ్లలో యోగా బోధనకు ఎలాంటి ఇబ్బంది లేనట్లయింది. హిందూ మతాన్ని స్కూళ్లలో విద్యార్థులపై రుద్దుతున్నారని కొందరు వాదించారు. ఆ వాదనను కోర్టు కొట్టేయడంతో యోగా టీచర్లకు ఊరట కలిగింది.