న్యూఢిల్లీ: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానిం చింది. 2018లో అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా ప్రభుత్వం శుక్రవారం నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. గోమాంసాన్ని రవాణా చేయడం, గోవధ చేశారనే ఆరోపణలతో ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది.
అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిన అంశాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఖండించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోని లౌకిక భావజాలం పట్ల భారత్ గర్విస్తోంది. ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇక్కడి ప్రజలందరికీ మత స్వాతంత్య్రం ఉంది. రాజ్యాంగం మైనారిటీలు సహా అన్ని వర్గాలకు హక్కులను కల్పిస్తోంది. ఎవరికీ ఎలాంటి హానీ కలగదు. ఈ విషయంలో విదేశీ ప్రభుత్వం జోక్యం తగదు’అని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment