ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. నివేదిక ప్రకారం రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వలస వెళ్లారని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్ఛేంజ్ అనే నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో అమెరికాకు వలస వెళుతున్న దేశాలలో (2018-2019) చైనా 3,69,548 మంది విద్యార్థులతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 2,02,014మంది విద్యార్థులతో రెండో స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో దక్షిణ కొరియా(52,250), సౌదీ అరేబియా(37,080), కెనడా(26,122) దేశాల విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు.
2018 లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులు 44.7 బిలియన్ డాలర్లు చెల్లించారని తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే 5.5 శాతం పెరిగిందని యుఎస్ వాణిజ్య విభాగం పేర్కొంది. అయితే 21.1శాతం విద్యార్థులు ఇంజనీరింగ్‌ను ఎన్నుకున్నారని వెల్లడించింది. 51.6శాతం విద్యార్థులు సైన్స్–టెక్నాలజీ–ఇంజనీరింగ్–గణితం(స్టెమ్) కోర్సులు అభ్యసించారని తెలిపింది. మరోవైపు అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులలో భారత్, చైనా దేశాల విద్యార్థులే 50శాతం ఉండటం గమనార్హం.
ఇక గత పదేళ్లుగా అమెరికాకు వలస వెళుతున్న విదేశీయులలో చైనా, భారత్ విద్యార్థులు మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారని నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా... గ్లోబల్ విద్యార్థులు అమెరికా వైపు మొగ్గు చూపడం శుభపరిణామని యూఎస్ విద్యా, సాంస్కృతిక వ్యవహారాల సహాయ కార్యదర్శి మేరీ రాయిస్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వీసా నిబంధనలను అమలు చేస్తున్నప్పటికి అత్యధిక భారతీయ విద్యార్థులు అమెరికావైపు మొగ్గచూపడం గమనార్హం. ఈ నివేదిక బట్టి భారతీయుల చూపు అమెరికా వైపు ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment