ప్రమాదంలో మత స్వేచ్ఛ
వాషింగ్టన్: 2016లో భారత్‌లో మతపర స్వేచ్ఛ, సహనం క్షీణించాయని అమెరికాకు చెందిన సంస్థ ఒకటి వెల్లడించింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు అధికంగా ఉన్న 12 దేశాల జాబితాలో భారత్‌నూ చేర్చింది. మైనారిటీలు, దళితులపై హిందూ జాతీయవాదులు, వారి సానుభూతిపరులు లెక్కలేనన్ని సార్లు బెదిరింపులు, హింస, వేధింపులకు పాల్పడ్డారని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
భారత్‌లో పది రాష్ట్రాల్లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయని తెలిపింది. మత మార్పిళ్లు, గోవధ, స్వచ్ఛంద సేవా సంస్థలకు విదేశీ నిధులపై ఆంక్షలు, సిక్కులు, బౌద్ధులు, జైనులను హిందువులుగా చూపుతున్న రాజ్యాంగ నిబంధనల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడించింది.
‘ప్రధాని మోదీ మతపర సహనం, మత స్వేచ్ఛ ప్రాముఖ్యం గురించి బహిరంగంగా బాగానే మాట్లాడుతున్నా... అధికార పార్టీకి చెందిన వారు మాత్రం, హింసకు కారణమవుతున్న హిందూ జాతీయవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారు’ అని ఆరోపించింది. మైనారిటీలు భారత్‌లో అభద్రతకు లోనవుతున్నారని, మతపర నేరాలు జరిగినపుడు వారికి పరిష్కార మార్గం కనిపించడంలేదంది. భారత్‌తో ద్వైపాక్షిక చర్చల్లో మత స్వేచ్ఛపై నెలకొన్న ఆందోళనలనూ చేర్చాలని అమెరికా ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది.