అభిప్రాయాలుండటం తప్పు కాదు. ప్రపంచంలో ఏ మారుమూలైనా సరే జరగరానిది జరుగుతున్నదని అనుకున్నప్పుడు ఆందోళనపడటం, కలవరపాటుకు లోనవడం నేరమేమీ కాదు. అమెరికా కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) కూడా ఇలాంటి ఆందోళననూ, కలవరపాటునూ ఏటా ఒక నివేదిక ద్వారా వ్యక్తం చేస్తుంటుంది. పనిలో పనిగా పలు దేశాల గురించి తీర్పులిస్తుంటుంది. అయితే తననూ, తన ప్రియ మిత్రులైన పాశ్చాత్య దేశాలనూ మినహాయించుకుని నివేదిక రూపొందించడంతోనే ఎవరికైనా పేచీ వస్తుంది. తన వంతుగా నివేదిక విడుదల చేయడం తప్ప దాన్ని గురించి ఎలాంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయనే అంశంపై ఆ కమిషన్ దృష్టి పెట్టినట్టు లేదు.
బహుశా అందువల్లే కావొచ్చు... ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నది. తాజాగా విడుదలైన కమిషన్ నివేదిక మన దేశంతోసహా చాలా దేశాల్లో మతపరమైన మైనారిటీలపై సాగుతున్న దాడుల గురించి, వాటి విషయంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావించింది. మన దేశంలోని స్థితిగతుల గురించి అయిదు పేజీల్లో వివరంగా చెప్పడంతోపాటు అఫ్ఘానిస్థాన్, రష్యా, టర్కీలతో సమం చేస్తూ ‘టైర్-2’ శ్రేణిలో చేర్చింది. 2009లో ఒడిశాలో క్రైస్తవులపై దాడులు జరిగినప్పటి నుంచీ భారత్ ఇదే శ్రేణిలో కొనసాగుతున్నది.
ప్రస్తుత నివేదికలో ప్రస్తావించినవి అందరికీ తెలిసినవే. బీజేపీ నేతలు మైనారిటీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రార్థనా స్థలాలపై జరిగిన దాడులు, ఘర్‌వాపసీ వంటి కార్యక్రమాలు నివేదికలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చాయి. ఆ ఉదంతాలకు సంబంధించి మన మీడియాలో ఇప్పటికే విస్తృతంగా వార్తలు, కథనాలు, వ్యాసాలు వెలువడ్డాయి. చానెళ్లలో తీవ్రస్థాయి చర్చలు జరిగాయి. మత ప్రమేయం లేకుండా అందరూ ఆ ఉదంతాలను ఖండించారు. ఆందోళనపడ్డారు. కేంద్ర మంత్రులు ఒకరిద్దరు ఇవి తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని సంజాయిషీ ఇచ్చుకున్నా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వీటిపై ఒక ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఒక దశలో మోదీ కూడా జోక్యం చేసుకోవాల్సివచ్చింది. ఆయా మత నాయకులను పిలిచి ఇలాంటివి జరగనీయ బోమని హామీ ఇవ్వాల్సివచ్చింది. ఇవన్నీ సమస్య తీవ్రతను, అది సృష్టించిన ఆందోళనను తెలియజెప్పాయి.
ఈమధ్యే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తుతూ ఆ దేశానికి చెందిన ‘టైమ్’ వారపత్రికలో పెద్ద వ్యాసం రాశారు. ‘వంద కోట్లమందికి పైగా ఉన్న భారతీయులు మోదీ నేతృత్వంలో కలిసిమెలిసి జీవిస్తుండటం, విజయాలు సాధిస్తుండటం స్ఫూర్తిదాయకమ’ని అందులో కీర్తించారు. ఇలా ‘ఉత్తేజభరితంగా, హృదయానికి హత్తుకునేలా’ రాసినందుకు నరేంద్ర మోదీ కూడా యథోచితంగా ఒబామాకు ధన్యవాదాలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి అభిప్రాయం ఉండగా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ మాత్రం...మోదీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలపై హింసాత్మక దాడులు చోటుచేసుకుంటు న్నాయనడం కాస్త గందరగోళపరిచే అంశమే. అంతకన్నా గందరగోళపరిచే అంశమేమంటే ఆ నివేదిక అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి మౌనంవహించడం.... అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశంగా ఉంటున్న సౌదీ అరేబియా వంటి దేశాల్లో చోటు చేసుకుంటున్న మత ఛాందసవాద ధోరణుల ఊసెత్తకపోవడం.
ఇక్కడ మైనారిటీల్లో అభద్రతా భావన కలిగేలా సాక్షి మహరాజ్, సాధ్వి నిరంజనజ్యోతి వంటివారు మాట్లాడటం నిజమే అయినా...అమెరికాలోనూ కొందరు క్రైస్తవ ఛాందసవాదులు అచ్చం ఆ మాదిరిగానే ప్రసంగాలు చేస్తుంటారు. అలాంటివారిని కూడా ప్రస్తావించి ఖండిస్తే నివేదిక విలువ పెరిగేది. అమెరికాలో ఈమధ్య దేవాలయాలపై బెదిరింపు రాతలు రాయడం, గురుద్వారాలపై దాడులు వంటివి జరిగాయి. సిక్కు యువకులను హత్య చేయడం, పేరునిబట్టి ముస్లిం అని గుర్తిస్తే అలాంటివారి విషయంలో అతిగా వ్యవహరించడం వంటివి చోటు చేసుకున్నాయి. జాత్యహంకార దాడుల సంగతి చెప్పనవసరమే లేదు. వారిపై సాగుతున్న హింసాకాండ అక్కడ వ్యవస్థీకృతం అయిపోయింది. వరసగా నల్లజాతి యువకులపై అక్కడి పోలీసులు సాగిస్తున్న దాష్టీకంపై ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతుండగానే ఈమధ్యే బాల్టిమోర్‌లో ఒక యువకుణ్ణి అకారణంగా పొట్టనబెట్టుకున్నారు. సరిగ్గా నివేదిక విడుదల చేసే సమయానికి అమెరికాలోని ప్రధాన నగరాలతోపాటు పలు ప్రాంతాలు అగ్నిగుండాన్ని తలపించేలా భగ్గుమంటున్నాయి. కనీసం అందుకైనా జాత్యహంకార దాడులను ప్రస్తావించి ఉంటే... తమ దేశంలో మైనారిటీలకు నానాటికీ రక్షణ కరువవుతున్న అంశాన్ని తెలిపి ఉంటే ఆ నివేదికకు సాధికారత వచ్చేది.
కమిషన్ అమెరికా కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే స్వతంత్ర సంస్థ అని చెబుతారు గనుక, అక్కడి పౌరులు పన్నుల ద్వారా చెల్లించే మొత్తంనుంచే దానికి నిధులు అందుతాయి గనుక ఆ సంస్థ పనితీరులో నిష్పాక్షికత కనబడాలని అందరూ ఆశిస్తారు. కమిషన్ నివేదికల విషయంలో మౌనంవహించే సంప్రదాయానికి భిన్నంగా మన దేశం ఈసారి స్పందించింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. నివేదికలో సంఘ్ పరివార్ సంస్థలపైనా, బీజేపీ నేతలపైనా నిశిత విమర్శలున్నాయి గనుక ఇలాంటి స్పందన వెలువడటంలో ఆశ్చర్యం లేదు. మత ఛాందసవాదాన్నీ, దాన్ని నెత్తినేసుకుని అన్యమతస్తులపై దాడులకు దిగేవారినీ ఏ మతస్తులూ అంగీకరించరు. అలాంటివారి మద్దతు పొందగలిగే రీతిలో మతస్వేచ్ఛ కమిషన్ పనితీరు ఉండాలి. పాక్షిక దృష్టితో వెలువరించే నివేదికలవల్ల ప్రయోజనం ఉండదు సరిగదా... చివరకు దెబ్బతినేది తన విశ్వసనీయత మాత్రమే. ఆ సంగతిని కమిషన్ గ్రహిస్తే మంచిది.
నివేదిక... నిజానిజాలు
Published Sat, May 2 2015 12:30 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement