ప్రభుత్వం మౌనం వీడాలి.. | High Court Fires On Telangana Govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మౌనం వీడాలి..

Published Thu, Feb 27 2020 2:16 AM | Last Updated on Thu, Feb 27 2020 2:16 AM

High Court Fires On Telangana Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మత స్వేచ్ఛ ముసుగులో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోకూడదు. రాష్ట్రానికి మౌనం ఎంత మాత్రం తగదు. ప్రభుత్వం నిశ్శబ్దాన్ని వీడాలి. ప్రేక్షకపాత్ర పోషిస్తామంటే హైకోర్టు చూస్తూ కూర్చోదు. మత విశ్వాసాల పేరుతో ప్రార్థనా మందిరాలను అక్రమంగా నిర్మిస్తే అడ్డుకునేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలుండాలి. మతపరమైన ఆక్రమ కట్టడాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోకపోతే రేపు మసీదులు, చర్చిలు, గురుద్వార్‌ వంటివి కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తాయి..’అని హైకోర్టు తీవ్రస్వరంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో మాధవపురి హిల్స్‌లోని రాక్‌ గార్డెన్స్‌ పార్క్‌లో 9,866 చదరపు గజాల్లో ఆలయాన్ని నిర్మించడాన్ని సవాల్‌ చేస్తూ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ట్రస్ట్‌ 2018లో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

ఈ పిల్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలోని ఆదేశాల మేరకు పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్‌ సుల్తానియా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఇతర అధికారులు విచారణకు స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ధర్మాసనం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక దశలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారణకు హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక నిమి త్తం అడ్వొకేట్‌ కమిషన్‌ను ఏర్పా టు చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. 

రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి?
‘దేవుడు కూడా చట్టానికి అతీతుడు కాడని నిరూపించేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన, స్పష్టమైన విధాన నిర్ణయాన్ని అమలుచేయాలి. రాష్ట్రం మౌనంగా ఉంటే.. కళ్లు తెరిచి చూస్తూనే తమకేమీ పట్టనట్లుగా ఉంటే.. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు అక్రమంగా ప్రార్థనా మందిరాల నిర్మాణాలు చేసుకుంటూ పోతే.. రేపు రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? ఆ మతం ఈ మతం అనే తారతమ్యం లేకుండా అక్రమ ప్రార్థనా మందిరాల్ని కూల్చేయాల్సిన పరిస్థితులున్నాయి. రాజస్తాన్‌లో ఆ తరహా విధానాన్ని అమలు చేసినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపేలా కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

ఈ ప్రక్రియ హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి మొదలుపెట్టండి. అక్రమ కట్టడాలను సంప్రదింపుల ద్వారా తొలగిస్తామంటే మత విశ్వాసాలున్న ప్రజలు ఒప్పుకోరు. అందుకే ప్రభుత్వం 2010 మార్చి 31న జారీ చేసిన జీవో 262ను అమలు చేసే దిశగా అధికారులు అడుగులు వేయాలి. జీవో జారీ చేసేనాటికే 2,224 ప్రార్థనా మందిరాలను అక్రమంగా నిర్మించినట్లు ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేనట్లుగానే అఫిడవిట్‌ ఉంది. అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఏం సంకేతాలు పంపుతున్నట్లు..? ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగిపోతున్నట్లుగా అనిపిస్తోంది..’అని ధర్మాసనం పేర్కొంది.

ఇంత నిర్లక్ష్యంగా అఫిడవిట్టా?
ప్రభుత్వ అఫిడవిట్‌ చూస్తే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. ప్రమాణం చేసి దాఖలు చేసే అఫిడవిట్‌లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక లేదు. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌.. కలెక్టర్‌కు ఇచ్చిన రిపోర్టులో ఏముందో కూడా లేదు. అమీన్‌పూర్‌ ఆలయ సముదాయం విషయంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆలయ కమిటీ సంగారెడ్డి కోర్టును ఆశ్రయిస్తే.. ఆ కోర్టులో కేసు ఏ స్థితిలో ఉందో కూడా ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొనలేదు. పైగా, ఈ కేసులో ఎవరినీ ప్రాసిక్యూట్‌ చేయబోమని పోలీసులు చెప్పడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదు.

మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు చెప్పినట్లుగా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం శోచనీయం. 2014లో ఆలయ సముదాయాన్ని నిర్మిస్తే 2017, 2020 సంవత్సరాల్లో రెండు నోటీసులు మాత్రమే ఇచ్చారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఒక్క ఆలయం విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో ఆచరణలో చూపించి మొత్తం రాష్ట్రానికి సంకేతాలివ్వండి..’అని ధర్మాసనం పేర్కొంది. వెంటనే ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి కల్పించుకుని అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటామని, పూర్తి వివరాలతో మళ్లీ అఫిడవిట్‌ దాఖలు చేస్తామని కోరడంతో కోర్టు అనుమతించింది.

భక్తుల పేరిట ఇంప్లీడ్‌కు నిరాకరణ
ఆలయాన్ని 2010లోనే నిర్మాణం చేశామని, 2014లోనే ఆలయ నిర్మాణానికి హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఆలయ కమిటీ తరఫు న్యాయవాది చెప్పారు. ఇంతవరకూ ఆలయ కమిటీ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదంటే మీకు ఆధ్యాత్మిక చింతన ఎంత ఉందో, చిత్తశుద్ధి ఎంత ఉందో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. భక్తుల తరఫున కేసులో ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని మరో న్యాయవాది ఉమేశ్‌ చంద్ర చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. 

అడ్వొకేట్‌ కమిషన్‌ ఏర్పాటు
క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదిక కోసం న్యాయవాది నూకల ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో అడ్వొకేట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ప్రతినిధిగా ప్రవీణ్‌రెడ్డి పర్యటిస్తారనే విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ గుర్తుంచుకోవాలని స్పష్టంచేసింది. ప్రవీణ్‌రెడ్డికి భద్రత కల్పించేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫీజుల నిమిత్తం ఆలయ కమిటీ ప్రవీణ్‌రెడ్డికి రూ.50 వేలు చెల్లించాలని పేర్కొంది. ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో పాటు దాని ప్లాన్, ఇతర పత్రాలను అడ్వొకేట్‌ కమిషన్‌కు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 13నాటికి అడ్వొకేట్‌ కమిషన్‌ నివేదిక సమర్పించాలని పేర్కొంది. 2010 నాటి జీవో 262లో 6,707 అక్రమ నిర్మాణాల్లో మతపరమైనవి 2,224 ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పటివరకూ అటువంటి నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో సమగ్రంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌లో తెలపాలని ఆదేశిస్తూ కోర్టు విచారణ వాయిదా వేసింది. 

పదేళ్ల క్రితమే జీవో జారీ అయినా..
ప్రార్థనా మందిరాల అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ చెప్పారు. జీవో 262లో 3 తరగతులుగా వర్గీకరణ చేశారని, ఇటీవలే నిర్మాణం చేసిన ప్రార్థనా మందిరాలను తక్షణమే తొలగించడం, కొంచెం పాత ప్రార్థనా మందిరాలను స్థానికుల సాయంతో తొలగించడం, బాగా పాత ప్రార్థనా మంది రాలు, భక్తుల మనోభావాలున్న వాటి విషయంలో అందరితో సంప్రదింపులు చేసి ఏకాభిప్రాయంతో తొలగింపు చర్యలు తీసుకోవడమని ఆయన వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. జీవో జారీ చేసి పదేళ్లు అయిందని, ఇప్పటివరకూ ఏం చేశారని ప్రశ్నించింది. పదేళ్లల్లో అక్రమ ప్రార్థనా మందిరాలు ఎన్ని పెరిగాయని, వాటిలో ఎన్నింటిని కూల్చారని నిలదీసింది. జీవోను పదేళ్లల్లో తొలిసారి సమీక్ష చేస్తున్నామని ఆయన చెప్పడంతో..ఏడాదికి ఒకసారైనా  సమీక్ష చేయకపోతే 2030 వరకూ మళ్లీ సమీక్షే ఉండకపోవచ్చునని వ్యాఖ్యానించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement