ఢిల్లీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, రాష్ట్రపతి కోవింద్ దంపతులతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్–ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని విస్తృతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్–ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు. ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే దీని విలువ తక్కువే ఉంటుందని ఆరోపించింది. మరోవైపు సాయుధ దళాల పరస్పర సహకార ఒప్పందం ప్రకారం ఒకరి మిలిటరీ బేస్‌లను మరొకరు వాడొచ్చు.
అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్
అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, మాక్రాన్ మాట్లాడారు. ‘మా రక్షణ సహకారం పటిష్టమైనది. భారత్‌కు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్’ అని మోదీ అన్నారు. ఇరు దేశాల సాయుధ దళాల మధ్యా పరస్పర లాజిస్టిక్ సహకారం రక్షణ సంబంధాల్లో కొత్త శకమన్నారు. ప్రాంతీయ సుస్థిరత, శాంతికి హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.
రక్షణ సంబంధాల్లో నూతన శకం..
స్కార్పీన్ జలాంతర్గాముల ప్రాజెక్టు, ఫైటర్ జెట్ల ఒప్పందం నేపథ్యంలో ఇరుదేశాల మధ్యా రక్షణ సంబంధాల్లో నూతన శకం ఆరంభమైందని మాక్రాన్ అన్నారు. యుద్ధ విమానాల ఒప్పంద పురోగతిని తాము స్వయంగా పర్యవేక్షిస్తానని, ఈ ప్రాజెక్టు కొనసాగాలని తాము భావిస్తున్నామని, ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే దీర్ఘాకాలిక ఒప్పందం ఇదని చెప్పారు. భారత్ తమ మొదటి వ్యూహాత్మక భాగస్వామి కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. సముద్ర తీరాలు ఆధిపత్యపోరాటానికి వేదికలు కాదని, పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏటా రక్షణ రంగానికి సంబంధించి మంత్రుల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ మంత్రి సీతారామన్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి పార్లే చర్చించారు
Comments
Please login to add a commentAdd a comment