
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో శాంతి నెలకొనాలంటే భారత్‌లో పరస్పర సహకారం అవసరమని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆ దేశ పార్లమెంటు ఎన్నికలకోసం తమ పార్టీ మేనిఫెస్టోను సోమవారం ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామిక్ సంక్షేమ దేశంగా పాక్‌ను మారుస్తానని హామీ ఇచ్చారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారానికి బ్లూప్రింట్ తమ వద్ద ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలకు పాటిస్తామన్నారు.
తమపార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పాలనాపరమైన ఇబ్బందులను 100 రోజుల్లోనే పరిష్కరించేందుకు అవసరమైన వ్యూహాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ‘పాకిస్తాన్‌లో శాంతి నెలకొనేందుకు మన సరిహద్దుదేశమైన భారత్‌తో సహకారాత్మక సత్సంబంధాలు అవసరం. పాకిస్తాన్ ప్రాధాన్యాలను గుర్తిస్తూ.. సరిహద్దు దేశాలతో ఘర్షణలేకుండా పరస్పర సానుకూల వాతావరణాన్ని నిర్మిస్తాం’ అని మేనిఫెస్టోలో ఇమ్రాన్ పేర్కొన్నారు. భారత్, చైనా, రష్యా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలు ఏర్పర్చుకుంటామన్నారు. జూలై 25న పాకిస్తాన్ పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.