ఆంటోనీ బ్లింకెన్
వాషింగ్టన్: యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్(విదేశాంగ మంత్రిగా) ఆంటోనీ బ్లింకెన్‌ను జోబైడెన్ ఎంచుకోబోతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చాలా కాలంగా బైడెన్‌కు బ్లింకెన్ విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు. జాతీయ సెక్యూరిటీ సలహాదారుగా జేక్ సల్లివాన్‌ను బైడెన్ నియమించవచ్చని అంచనా. మంగళవారం బైడెన్ తన కేబినెట్ నియామకాలను వెల్లడించనున్నారు. ఒబామా రెండోమారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్లింకెన్ డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరించారు.
బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఆదినుంచి బ్లింకెన్ భారత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. బ్లింకెన్‌ను బైడెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమించే యోచనలో ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్‌పోస్ట్, ద డైలీ కథనాలు వెలువరించాయి. మంగళవారం ఈ ప్రకటన అధికారికంగా వెలువడవచ్చన్నాయి.
ఈ ఏడాది భారత స్వాతంత్య్ర సంబరాల సమయంలో బైడెన్ బృందం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సదస్సులో బ్లింకెన్ భారత్ పక్షాన మాట్లాడారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను బైడెన్ కోరుతున్నారన్నారు. భారత్‌పై అణుపరీక్షల సమయంలో విధించిన ఆంక్షల తొలగింపులో బైడెన్ చేసిన కృషిని గుర్తు చేశారు. అదేవిధంగా ఇరుదేశాల మధ్య సివిల్‌న్యూక్లియర్ డీల్ కుదరడంలో కూడా బైడెన్ కీలక పాత్ర పోషించారన్నారు. మరోవైపు ఐరాసలో లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను నియమించాలని బైడెన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బాధ్యతల బరువు
ట్రంప్ హయంలో పలు దేశాలతో యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి ఆయాదేశాలతో సంబంధాలను గాడిన పెట్టాల్సిన పెద్ద బాధ్యత బ్లింకెన్‌పై ఉండనుంది. అలాగే డబ్లు్యహెచ్‌ఓ, పారిస్ ఒప్పందం, ఇరాన్ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగడం పలు దేశాలకు విముఖత కలిగించింది. ఈ పరిస్థితులను బ్లింకెన్ చక్కదిద్దాల్సిఉంటుంది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా.. ఇతర దేశాలను సహాయ సహకారాలందించడం ద్వారా అమెరికావైపు ఆకర్షిస్తామని బ్లింకెన్ గతంలో చెప్పారు.
బైడెన్ బలహీనుడు: చైనా
బీజింగ్: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయితే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న భ్రమల నుంచి చైనా బయటకు రావాలని చైనా ప్రభుత్వ సలహాదారు ఒకరు పేర్కొన్నారు. అమెరికా తీసుకునే మరింత కఠిన వైఖరికి సిద్ధం కావాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. షెన్‌జెన్‌లోని అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్‌కు డీన్‌గా ఉన్న ఝెంగ్ యొంగ్‌నియన్ ఇటీవల సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పేర్కొన్నారు. బైడెన్ చాలా బలహీన అధ్యక్షుడు. అమెరికా సమాజంలో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను అవకాశంగా తీసుకుని, యుద్ధానికీ దిగుతారు’అని ఝెంగ్ విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment