న్యూఢిల్లీ: సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన కీలక ఒప్పందం గురించి భారత్- అమెరికాల మధ్య త్వరలోనే 2+2 చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు ఈనెల 26, 27 తేదీల్లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై పెండింగ్‌లో ఉన్న ఒప్పందాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బేసిక్ ఎక్స్స్ఛేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)పై భారత్ సంతకం చేయనుంది. శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్‌డ్ డ్రోన్స్ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదరనుంది. (చదవండి: చైనాకు చెక్ పెట్టేందుకు ఆ 4 దేశాలు..)
టోక్యోలో సమావేశమై..
కాగా భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటం సహా ఇండో- ఫసిఫిక్ సముద్రజలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్(క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) గురించి చర్చించేందుకు జపాన్‌లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు టక్యోలో సమావేశమై క్వాడ్ వ్యూహంపై చర్చలు జరుపనున్నారు. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో అక్టోబర్ 6న భేటీ కానున్నారు. అక్కడే బీసీఈఏ గురించి కూడా ప్రస్తావించి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా వైఖరిపై చర్చ
ఈ క్రమంలో ఈనెల 15 తర్వాత యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బీగన్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత నెలాఖరులోగా మిలిటరీ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. అదే విధంగా 2+2 చర్చల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చే అమెరికా మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. లదాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రంపై పైచేయి సాధించేందుకు చేపడతున్న చర్యలు, తైవాన్ విషయంలో డ్రాగన్ దేశ వైఖరి తదితర అంశాల గురించి చర్చించనున్నారు.
అంతేగాకుండా తాలిబన్లతో అమెరికా చారిత్రక ఒప్పందం, అఫ్గనిస్తాన్‌లో బలగాల ఉపసంహరణకై నిర్ణయం, శాంతి స్థాపన, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న తీరు, సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల గురించి కూడా భారత్- అమెరికా ప్రతినిధుల భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా భారత్‌పై విషం చిమ్మే పాకిస్తాన్ మిత్రదేశం చైనా సాయంతో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే జాబితా నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, టర్కీ సాయంతో అజర్‌బైజాన్ గుండా జిహాదీలు యథేచ్ఛగా సాగిస్తున్న చొరబాట్లు తదితర విషయాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.
చర్చలు పూర్తయినట్లయితే
ఇక ఈ 2+2 చర్చలు విజయవంతంగా పూర్తైనట్లయితే యూఎస్ గ్లోబల్ జియో- స్పేషియల్ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో భారత్- అమెరికా ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే.
కాగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ జరుగనున్న తేదీల్లోనే ఈ మేరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం విశేషం. ప్లీనరీలో భాగంగా 370 సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో దౌత్య, సైనిక, విదేశాంగ తదితర కీలక అంశాల్లో ప్రభుత్వ విధానాలు, రానున్న ఐదేళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల గురించి చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment