ఫ్లీట్ రివ్యూ అంటే | what is International Fleet Review? | Sakshi
Sakshi News home page

ఫ్లీట్ రివ్యూ అంటే

Published Thu, Jan 28 2016 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

ఫ్లీట్ రివ్యూ అంటే

ఫ్లీట్ రివ్యూ అంటే

విశాఖపట్నం : దేశంలోని యుద్ధ నౌకల పాటవాన్ని నిర్ధేశిత ప్రాంతంలో సమీక్షించే కార్యక్రమమే ఫ్లీట్ రివ్యూ. దేశ సార్వభౌమత్వవానికి అది ప్రతీకగా నిలుస్తుంది. ఫ్లీట్‌లోనే  కాకుండా దేశ ప్రజలల్లోనూ అత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతుంది. ఆ దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచ దేశాలకు తేటతెల్లం చేయడం దీనిలో అంశమైంది. దేశాధ్యక్షుని గౌరవార్థం నిర్వహించే ఈ నౌకా ప్రదర్శనలో ఆయనే సమీక్ష చేస్తారు. ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరుపుతున్న దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు ఫ్లీట్‌లో పాల్గొనడంతో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూగా మారింది.  భారత్ సైతం విదేశాల్లో జరిగే ఫ్లీట్ రివ్యూల్లో పాల్గొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పలు దేశాల్లోనూ భారత యుద్ధనౌకలు పాల్గొన్నాయి.
 
తొలిసారిగా...
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పిఎఫ్‌ఆర్) తొలిసారిగా దేశాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ గౌరవార్దం 1953 అక్టోబర్ 19న ముంబయ్‌లో జరిగింది. అలాగే నాటి దేశాధ్యక్షులు రాధాకృష్ణన్, వివి గిరి, అహ్వాద్, జ్ఞాని జైల్‌సింగ్, ఆర్.వెంకటరామన్‌ల గౌరవార్దం ముంబయ్‌లో జరిగాయి.  కె.ఆర్.నారాయణన్ దేశాధ్యక్షునిగా పదవీకాలంలో 2001 ఫిబ్రవరి 12న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను భారత్ విజయవంతంగా నిర్వహించింది. అనంతరం అబ్దుల్ కలాం హయాంలో 2006 ఫిబ్రవరి 13న తొలిసారిగా పీఎఫ్‌ఆర్ విశాఖ తీరంలోనే జరిగింది.  ప్రతిభాపాటిల్ గౌరవార్థం 2011 డిసెంబర్ 20న ముంబయ్ వేదికగా ఫ్లీట్ రివ్యూ జరిగింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం విశాఖలో ఐఎఫ్‌ఆర్ జరగనుంది. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనేందుకు దాదాపు 70 దేశాల నౌకలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల యుద్ధనౌకలు ఇక్కడికి చేరుకున్నాయి.
 
 పదిసార్లు...

 స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం భారత్ సైతం పదిసార్లు ఫ్లీట్ రివ్యూ నిర్వహించింది. వాటిలో పదిహేనేళ్ళ క్రితం ముంబయ్ తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇదే తొలిసారి భారత్ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం. 29 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశాధ్యక్షుని పదవీకాలంలో ఓసారి మాత్రమే ఈ రివ్యూ జరుగుతుంది. అలా భారత్‌లో పదిసార్లు ప్రెసిడెంట్ రివ్యూగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ తూర్పు తీరంలో నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి.
 
విశిష్ట గౌరవం
విశాఖలో తొలిసారిగా జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(2006)లో రక్షణ మంత్రిగా ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారు. విశాఖలోనే తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(2016)కి నేడు ఆయన దేశాధ్యక్షుని హోదాలో హాజరుకానుండడం మరో విశేషం. ఇప్పటి వరకు ఫ్లీట్ రివ్యూల్లో ఇలాంటి గౌరవం ఇదే తొలిసారి.
 
సమీక్షలో...
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూల్లో పలు యుద్ధ నౌకలు పాల్గొంటాయి.  ఇందులో ఒక నౌకను ప్రెసిడెంట్ యాచ్‌గా పేర్కొంటారు. ఆ నౌకను అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే అన్ని దేశాల జెండాలతో అలంకరిస్తారు. గౌరవ సూచకంగా ఆ నౌక చుట్టూ వలయాకారంలో ఆయా దేశాల నౌకలు ఫార్మేషన్‌తో ముందుకు కదులుతారయి.
 
లంగర్ వేసిన విదేశీ యుద్ధ నౌకలు
పలు ఖండాలకు చెందిన దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరం వైపు కదులుతున్నాయి.  కెనడా, యూఎస్‌ఏ, కొలంబియా, ఆంటిగ్వా, బ్రెజిల్, పెరూ, చిలీ, స్వీడన్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, తునిషియా, సెనెగల్, సౌతాఫ్రికా, మెంజాబిక్, టాంజానియా, కెన్యా, సూడాన్, టర్కీ, ఈజిప్ట్, బెహ్రాన్, సౌదీఅరేబియా, ఓమన్, టుర్కుమెనిస్తాన్, ఇజ్రాయిల్, శ్రీలంక, మాల్దీవులు, మారిషన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, రష్యా, సౌత్‌కొరియా, జపాన్, బ్రనయ్ తదితర దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు సముద్ర, గగనతలం విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. చివరిరోజు టాల్ షిప్స్ తెరచాపలతో సెయిల్ ఇన్ కంపెనీగా విశాఖ నుంచి చెన్నయ్ తీరంవైపు కదలనున్నాయి. ఫ్లీట్ రివ్యూలో ఇదో ప్రత్యేక ఆకర్షణ.
 
భారత్‌లో 18వ శతాబ్దిలోనే
భారత ఫ్లీట్ రివ్యూ 18వ శతాబ్దంలోనే జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మరాటా నౌకాదళ శక్తిసామర్ద్యాల ప్రదర్శన మహారాజ్ శివాజీ ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటన్‌లో సెయిల్ ఫర్ వార్ సందర్భంగానూ, యూఎస్‌ఎలో గ్రేట్ వైట్ ఫ్లీట్ పేరిట తొలిసారిగా జరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement