వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/మాస్కో: అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఇరుదేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీలో జూలై 16న ఈ భేటీ జరగనుందని శ్వేతసౌధం, క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) గురువారం ప్రకటించాయి. ‘పరస్పర జాతీయ భద్రతాంశాలతో సహా ద్వైపాక్షికాంశాలపై ట్రంప్, పుతిన్‌లు చర్చలు జరుపుతారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు.
‘ట్రంప్, పుతిన్‌లు అమెరికా–రష్యా సంబంధాల్లోని ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, పలు కీలక అంతర్జాతీయ అంశాలను చర్చిస్తారు’ అని క్రెమ్లిన్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం మాస్కోలో పుతిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ల సమావేశం తర్వాతే జూలై 16న సమావేశం తేదీ ఖరారైంది. ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య చర్చలు, అనంతరం సంయుక్త మీడియా సమావేశం ఉంటుంది. వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా ప్రకటన కూడా విడుదల చేస్తారని క్రెమ్లిన్ వెల్లడించింది.
బోల్టన్‌తో సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందని.. అమెరికా–రష్యాల ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతితోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి ఈ సమావేశం బాటలువేస్తుందని భావిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. జూలై 11,12 తేదీల్లో బెల్జియంలోని బ్రసెల్స్‌లో నాటో సదస్సు జరిగిన నాలుగురోజుల తర్వాత వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. 2017 జూలైలో జీ–20 సదస్సు సందర్భంగా జర్మనీలో ట్రంప్, పుతిన్‌లు తొలిసారి కలుసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో చర్చలు జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment