చైనాకు బయల్దేరుతూ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మోదీ అభివాదం
వుహాన్: ఆసియాలో, వివిధ ప్రపంచ వేదికలపై కీలక శక్తులుగా ఉన్న భారత్, చైనాలు తమమధ్యనున్న విభేదాలను చెరిపేసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు చైనాలోని వుహాన్‌లో విస్తృతమైన చర్చలు జరగనున్నాయి. ఈ అనధికార సదస్సులో ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ఆసియా ప్రాంత, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 73 రోజుల పాటు డోక్లాంలో ఇరుదేశాల సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకుని పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
వ్యూహాత్మక, ప్రాధాన్యతాంశాలపై చర్చ
ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం బీజింగ్‌కు బయలుదేరారు. జిన్‌పింగ్‌తో ఇరుదేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘జిన్‌పింగ్, నేను ద్వైపాక్షిక, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటాం. భారత్–చైనా సంబంధాల్లో వ్యూహాత్మక, ద్వైపాక్షిక అంశాల్లో ప్రగతిని దీర్ఘకాల దృష్టికోణంలో సమీక్షిస్తాం’ అని చైనా పర్యటనకు బయలుదేరే ముందు మోదీ అన్నారు. శుక్ర, శనివారాల్లో వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. డోక్లాంతోపాటుగా జైషే మహ్మద్ చీఫ్ అజర్‌పై ఐరాస నిషేధం, ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడటం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య స్పష్టమైన విభేదాలున్న సంగతి తెలిసిందే. మోదీ–జిన్‌పింగ్ మధ్య జరగనున్న అనధికార సదస్సులో ద్వైపాక్షిక అంశాల్లో నెలకొన్న సమస్యలు, సరిహద్దు వివాదాలు, వాణిజ్యపరమైన అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యమైతే.. వీరి భేటీ అంతర్జాతీయంగా ఓ గేమ్‌చేంజర్ కావొచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మోదీ కోసం వుహాన్‌లో చేస్తున్న ఏర్పాట్లు భారత్ అంచనాలకు అందనంత గొప్పగా ఉన్నాయని చైనా పేర్కొంది.
వుహాన్.. అందమైన పర్యాటక క్షేత్రం
చైనా చరిత్రలో వుహాన్‌కు గొప్ప స్థానం ఉంది. ఆధునిక చైనా నిర్మాత మావో జెడాంగ్‌కు అత్యంత ఇష్టమైన విడిది వుహాన్. మధ్య చైనాలోని వుహాన్‌లో యాంగ్జే నదిలోని ప్రఖ్యాతిచెందిన ఈస్ట్‌లేక్ ఒడ్డున మోదీ–జిన్‌పింగ్‌ల భేటీ జరగనుంది. జెడాంగ్ అప్పట్లో ఉండే భవనాన్ని ఆయన స్మృతి భవనంగా మార్చారు. ఇక్కడే ఇరువురు దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. ఈస్ట్ లేక్ వెంబడి వీరిద్దరు నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటారని నదిలో బోట్ రైడ్ సందర్భంగా చర్చలు జరుగుతాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment