మోదీ, జిన్‌పింగ్‌ విస్తృత చర్చలు | Xi Jinping meets Narendra Modi, eyes new chapter in China-India ties | Sakshi
Sakshi News home page

కలసి సాధిద్దాం

Published Sat, Apr 28 2018 1:15 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Xi Jinping meets Narendra Modi, eyes new chapter in China-India ties - Sakshi

శుక్రవారం వుహాన్‌లో భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

 వుహాన్‌: ప్రపంచంలోని దాదాపు 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పెద్ద సరిహద్దు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్‌లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హృదయపూర్వక సమావేశం (హార్ట్‌ టు హార్ట్‌ సమ్మిట్‌)గా పేర్కొంటున్న ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు.

తమ రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. రెండో రోజు చర్చలు నేడు ఉదయం ప్రారంభం కానున్నాయి. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోదీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే బలం: భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతోపాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. భారత్‌–చైనాల మధ్య శతాబ్దాల బంధాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్, చైనాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ‘గత 2వేల ఏళ్లలో దాదాపు 1600 ఏళ్ల పాటు భారత్, చైనాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలే దాదాపు 50 శాతం భాగస్వామ్యాన్ని కలిగున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు.  బీజింగ్‌కు వెలుపల రెండుసార్లు జిన్‌పింగ్‌ స్వాగతం పలికిన తొలి భారత ప్రధానిగా నిలవటం గర్వంగా ఉందని మోదీ తెలిపారు. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల కోసం ‘ఉమ్మడి ఆలోచన, సమాచార మార్పిడి, బలమైన బంధం, పరస్పర ఆలోచన విధానం, పరస్పర పరిష్కారం’ అనే ఐదు అంశాలను మోదీ ఈ భేటీలో ప్రతిపాదించారు.

సంయుక్త భాగస్వామ్యంతో..: ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. ‘గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలి. భారత్‌–చైనా సహకారానికి బంగారు భవిష్యత్తు ఉందని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘ఐదేళ్లుగా మనం చాలా సాధించాం. సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ దిశగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నాం. మరింత అభివృద్ధి జరిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్య ప్రభావం స్పష్టంగా కనబడుతోంది’ అని జిన్‌పింగ్‌ తెలిపారు. ‘మీతో కలిసి పలు అంశాలపై మరింత లోతైన భాగస్వామ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాను’ అని ఆయన మోదీతో తెలిపారు. ‘మన దేశాలకు పునరుత్తేజం కల్పించేందుకు అవసరమైన సుస్థిరత కల్పించుకోవటం, అన్ని రంగాల్లో అభివృద్ధి, పరస్పర అభివృద్ధికి సహకారాన్ని బలోపేతం చేసుకోవటం, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేయటంపై భారత్‌–చైనా దృష్టిపెట్టాలి’ అని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సహా పలు దేశాలు రక్షణాత్మక వ్యూహాలు అమలుచేస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

ఘనస్వాగతం పలికిన జిన్‌పింగ్‌: శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వుహాన్‌ చేరుకున్నారు. మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాల అనంతరం అనధికార చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మకంగా, దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని సమీక్ష జరుపుతారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు’ అని ఆయన  చెప్పారు.

జిన్‌పింగ్‌కు అద్భుతమైన కానుక: ఈ చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్‌ వేసిన చిత్రాన్ని జిన్‌పింగ్‌కు మోదీ కానుకగా ఇచ్చారు. ప్రస్తుత పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి యూనివర్సిటీలో 20వ శతాబ్దపు ప్రారంభంలో బీహోంగ్‌ చిత్రలేఖనం బోధించేవారు. ఆధునిక చైనా చిత్రకళను ఈయన ప్రపంచానికి పరిచయం చేశారు.

‘స్ట్రెంత్‌’కు మోదీ నిర్వచనం: చైనా పర్యటనలో ప్రధాని మోదీ భారత్, చైనా ప్రజల మధ్య బంధాల బలోపేతాన్ని కాంక్షిస్తూ స్ట్రెంత్‌ అనే పదానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. స్ట్రెంత్‌ పదంలోని ఆంగ్ల అక్షరాలకు వరుసగా ఎస్‌ అంటే ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), టీ అంటే సంప్రదాయం, వాణిజ్యం, సాంకేతికత (ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ), ఆర్‌ అంటే బంధం (రిలేషన్‌షిప్‌), ఈ అంటే వినోదం (ఎంటర్‌టైన్‌మెంట్‌ – సినిమాలు, కళలు, నృత్యాలు మొదలైనవి), ఎన్‌ అంటే పర్యావరణ పరిరక్షణ (నేచర్‌ కన్జర్వేషన్‌), జీ అంటే క్రీడలు (గేమ్స్‌), టీ అంటే పర్యాటకం (టూరిజం), హెచ్‌ అంటే ఆరోగ్యం (హెల్త్, హీలింగ్‌) అని పేర్కొన్నారు.   

అప్పుడు సీఎంగా.. ఇప్పుడు పీఎంగా!
గుజరాత్‌ సీఎంగా స్టడీ టూర్‌లో భాగంగా ‘త్రీ గార్జెస్‌ డ్యామ్‌’ను సందర్శించినట్లు మోదీ తెలిపారు. ‘వేగంగా పూర్తయిన ఈ డ్యామ్‌ నిర్మాణం, దీని ఎత్తు నన్ను అబ్బురపరిచాయి. ఓ రోజంతా డ్యామ్‌ దగ్గరే గడిపి దీని విశేషాలు తెలుసుకున్నాం’ అని మోదీ తెలిపారు. యాంగ్జీ నదిపై నిర్మించిన ఆ డ్యామ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు. 2.3 కిలోమీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తు, 32 హైడ్రో పవర్‌ టర్బో జనరేటర్లు, ఐదు దశల షిప్‌ లాక్, షిప్‌ లిఫ్ట్‌ వ్యవస్థతో అధునాతన ప్రాజెక్టుగానూ ప్రత్యేకతను చాటుకుంది.

డోక్లామ్, సీపీఈసీలను లేవనెత్తండి!
న్యూఢిల్లీ/మంగళూరు: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా డోక్లాం, చైనా–పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)ల గురించి చర్చించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ భారత్‌కు నష్టం కలిగించే అంశాలను భేటీలో ప్రస్తావించాలన్నారు. చైనా పర్యటన సందర్భంగా మోదీ కాస్త టెన్షన్‌గా కనిపించారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈస్ట్‌ లేక్‌ ఒడ్డున డిన్నర్‌ చర్చలు
చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్‌ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. సాయంత్రం ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఇరుదేశాల నుంచి ఆరుగురు అధికారుల చొప్పున పాల్గొన్నారు. రాత్రి ఈస్ట్‌ లేక్‌ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం పదిగంటలనుంచి (స్థానిక కాలమానం ప్రకారం) మళ్లీ ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి.

ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా ఒత్తిడిలేని వాతావరణంలో ఈ అనధికార సదస్సు జరగాలని ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ పగ్గాలు చేపట్టాక పలు అంతర్జాతీయ వేదికలపై 12సార్లకు పైగా వీరు కలుసుకున్నారు. అయినప్పటికీ.. ఇద్దరు దేశాధినేతలు మనసువిప్పి మాట్లాడుకోవటం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న పలు సమస్యల పరిష్కారంపై తరచూ సమీక్షలు నిర్వహించాలనే ఆలోచనలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానిగా మోదీకి ఇది నాలుగో చైనా పర్యటన.

                      వుహాన్‌లోని ఓ ఎగ్జిబిషన్‌లో వాద్యపరికరాన్ని వాయిస్తున్న మోదీ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement