సాక్షి, చెన్నై : ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లను స్వాగతిస్తూ బ్యానర్లు పెట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. అంతేకాక, ఇలాంటి విషయాల్లో తమ అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించింది. వివరాల్లోకెళితే.. అక్టోబరు 11, 12 తేదీల్లో ఇరు దేశాల నాయకుల మధ్య తమిళనాడులోని పర్యాటక పట్టణమైన మామళ్లపురంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ పట్టణం చెన్నై విమానాశ్రయం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేస్తామని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే ఇంతకు ముందు బ్యానర్లు, ప్లెక్సీలను మద్రాస్ హైకోర్టు నిషేధించింది. 20 రోజుల క్రితం ప్లెక్సీ కారణంగా ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శుభశ్రీ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెక్సీలు, బ్యానర్లు కట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తొలగించి దాదాపు 650 మందిపై అధికారులు కేసులు పెట్టారు. (చదవండి : యువతిని బలిగొన్న బ్యానర్)
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ హైకోర్టులో అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశారు. అగ్రశ్రేణి ప్రముఖుల పర్యటనల సందర్భంగా వారి గౌరవార్ధం హోర్డింగులు ద్వారా స్వాగతించడం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంప్రదాయమని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువలన తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.సత్యనారాయణన్, జస్టిస్ శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ పైన పేర్కొన్న విధంగా స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు హోర్డింగులు పెట్టకుండా మాత్రమే నిషేధించామని ప్రభుత్వానికి కాదని తెలిపింది. అయితే ఈ చర్యను ప్రతిపక్ష డీఎమ్‌కే వ‍్యతిరేకిస్తోంది. దీని వెనుక రహస్య ఎజెండా ఉందని, దీన్ని సాకుగా చూపి భారీ సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని డీఎంకే నేత స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment