
నేడు ఒబామాతో ప్రధాని మన్మోహన్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నేడు సమావేశం కానున్నారు. వైట్ హౌస్‌లో జరిగే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే విధంగా చర్చలు జరగనున్నాయి. ఒబామా, మన్మోహన్ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంతో పాటు పౌర అణు ఒప్పందం అమలు కూడా ప్రధాన ఎజెండాగా ఉండనుంది. చర్చల అనంతరం రక్షణ రంగంతో పాటు పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపించే అమెరికా వీసా నిబంధనల్లో మార్పు ప్రతి పాదనలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. దక్షిణాసియాలో తాజా పరిస్థితులు, అఫ్ఘానిస్థాన్‌లో బలగాల ఉపసంహరణ, సిరియా తదితర అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. 2009 తర్వాత ఒబామా, మన్మోహన్ భేటీ కావడం ఇది మూడోసారి. దశాబ్దకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయని, అమెరికా.. భారత్‌కు కీలక భాగస్వామిగా మారిందని అమెరికా పర్యటనకు ముందు ప్రధాని వ్యాఖ్యానించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి తన పర్యటన దోహదపడుతుందని చెప్పారు.
మరోవైపు ఒబామా సైతం మన్మోహన్‌తో భేటీకి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఒబామాతో భేటీ తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి మన్మోహన్ హాజరవుతారు. ఆ తర్వాత 29న న్యూయార్క్‌లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ భేటీ కానున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి ఉగ్రవాద దాడులపై భారత్ ఆందోళనను మన్మోహన్ పాక్ కొత్త ప్రధానికి తెలియజేస్తారని భావిస్తున్నారు.