
ద్వైపాక్షిక సంబంధాలకు ప్రాధాన్యం: డేవిడ్ కామెరాన్
మన్మోహన్‌తో బ్రిటన్ ప్రధాని కామెరాన్ భేటీ
బ్రిటన్ రావాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి లేదని వెల్లడి
న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విసృ్తతపర్చాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ పేర్కొన్నారు. రెండు దేశాలు కలిసి పనిచేస్తే ఉగ్రవాదం లాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. పలు అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై గురువారం ఆయన భారత ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్‌తో చర్చలు జరిపారు. 2010 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో జరిగిన అసాధారణ అభివృద్ధిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
బెంగళూరు- ముంబై ఆర్థిక కారిడార్, భారత్- యూరోపియన్ యూనియన్‌ల మధ్య జరిగిన విసృ్తత వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందం, అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితి మొదలైన అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్తూ.. కామెరాన్ భారత్‌లో ఒకరోజు పర్యటన జరిపారు. చోగమ్ సదస్సుకు భారత ప్రధాని హాజరుకాకపోవడంపై కామెరాన్ స్పందిస్తూ.. ‘భారత్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఇండియా, కెనడా, బ్రిటన్.. మేమంతా తమిళ సమస్య పరిష్కారానికి శ్రీలంక ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందనే భావిస్తున్నాం’ అన్నారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సహా ఎన్నికైన నేతలెవరితో అయినా సమావేశమయ్యేందుకు తాను సిద్ధమేనని కామెరాన్ అన్నారు. ఐఐఎం కోల్‌కతా విద్యార్థులతో మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనన్నారు.
భారతీయ విద్యార్థులందరికీ స్వాగతం: బ్రిటన్‌లో చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేమరాన్ శుభవార్త తెలిపారు. తమ దేశంలో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యకు ఎలాంటి పరిమితి లేదని భారతీయ వ్యాపారవేత్తలతో జరిపిన మర్యాదపూర్వక భేటీలో వెల్లడించారు. అయితే వారు బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో వాస్తవంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు అయి ఉండాలన్నారు. అలాగే వారు బ్రిటన్ వలస నిబంధనలను జాగ్రత్తగా పాటించాలని సూచించారు. వేరే ఉద్యోగాల్లో చేరకుండా, గ్రాడ్యుయేట్ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాలన్నారు. ‘రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాను. ఒకటి.. భారత్ నుంచి బ్రిటన్ వచ్చి చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. రెండు.. అక్కడి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తయిన తరువాత బ్రిటన్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి లేదు’ అని కేమరాన్ వివరించారు. గత పదేళ్లలో వలస నిబంధనలపై అంతగా దృష్టి పెట్టలేదని, ఆ కాలంలో 20 లక్షల మంది బ్రిటన్‌కు వచ్చారని, భౌగోళికంగా చిన్నదేశమైన తమకు అది భారమేనన్నారు.