సంపాదకీయం
కొన్నేళ్లక్రితం మన అధికారులతో చర్చల సందర్భంగా చైనా మంత్రి ఒక హితబోధలాంటి హెచ్చరిక చేశారు. ‘ఎక్కడో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అంకుల్‌పై ఆధారపడేకంటే మీ పొరుగుతో సఖ్యంగా ఉండటమే మీకు మేల’న్నది ఆ హితబోధ సారాంశం. ఆయన అంకుల్ అన్నది ‘అంకుల్ శామ్’నుద్దేశించేనని... మంచిగా ఉండమంటున్నది తనతోనేనని వేరే చెప్పనవసరం లేదు. మనం అమెరికా ఆసరాతో ప్రాంతీయ శక్తిగా ఎదుగుతామేమోనన్న భయం చైనాకు చాన్నాళ్లనుంచి ఉంది. అందువల్లే మనతోగల 4,057 కిలోమీటర్ల పొడవునా అప్పుడప్పుడు ఏదో ఒకచోట అతిక్రమణలకు పాల్పడటం, ఏదో ప్రాంతంలోకొచ్చి చిన్న గుడారంవేసి హడావుడిచేయడం దానికి అలవాటైన పని. అలాగని ఆ దేశం మనతో కరచాలనమూ ఆపదు...కబుర్లు చెప్పడమూ మానదు.
సరిహద్దు సమస్యకు సానుకూల పరిష్కారం వెదికేలోగా దాంతో సంబంధం లేకుండానే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుందామని, సరిహద్దుల్లో ఎవరమూ హద్దు మీరవద్దని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. అందుకనుగుణంగా సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. దానికి సమాంతరంగా చిన్నా చితకా సమస్యలూ ఉంటున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో అన్నిటిలాగే నిస్తేజంగా పడివున్న విదేశాంగ విధానానికి ప్రధాని నరేంద్ర మోడీ తొలిరోజునుంచే కాయకల్ప చికిత్స ప్రారంభించారు. ఎంతసేపూ పాశ్చాత్య దేశాలపై దృష్టిసారించి, వారితో స్నేహబంధానికి తహతహలాడే తీరును మార్చి ఇరుగుపొరుగుకు దగ్గరయ్యే విధానానికి తెరతీశారు.
ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే ఆ ఉత్సవానికి అతిథులుగా వచ్చిన సార్క్ దేశాల అధినేతలతో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఫోన్‌ద్వారా తనను అభినందించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో ఆయన సంభాషించారు. భారత్‌తో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు కెకియాంగ్ చెప్పగా, అన్ని ‘అపరిష్కృత సమస్యల’పైనా ఆ దేశంతో కలిసిపని చేయాలన్న ఆకాంక్షను మోడీ వ్యక్తంచేశారు. ఇరుదేశాల ఉన్నతస్థాయి బృందాలు రెండు దేశాల్లోనూ తరచు పర్యటిస్తూ స్నేహ సంబంధాలను పెంచుకోవాలని ఇద్దరూ నిర్ణయించారు. ఇందుకనుగుణంగా చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఈ నెల 8న భారత్ పర్యటనకు వస్తున్నారు. మోడీ పాలనాపగ్గాలు చేపట్టాక వస్తున్న తొలి విదేశీ అతిథి వాంగ్.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ 2006 సంవత్సరంలో మొదలెట్టి వివిధ సందర్భాల్లో మూడుసార్లు చైనాను సందర్శించారు. 2011లో వెళ్లినప్పుడైతే మోడీకి ‘గ్రేట్ హాల్ ఆఫ్ చైనా’వద్ద స్వాగతసత్కారాలు ఏర్పాటు చేయడంద్వారా దేశాధినేతలకు వర్తించే ప్రొటోకాల్‌ను అమలుచేసి చైనా ఆయనను గౌరవించింది. కనుక ఆ దేశంతో మోడీకి ఇప్పటికే మంచి అనుబంధం ఉన్నదని చెప్పవచ్చు. కనుక మన విదేశాంగ విధానానికి ఎప్పటినుంచో పెద్ద సవాల్‌గా ఉన్న భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ అనుబంధం మరింతగా దోహదపడుతుందనుకోవాలి. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’(తూర్పు దేశాలపై దృష్టి) విధానం తనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిందేనన్న శంక చైనాలో ఉన్నది.
ఆ దేశం వెన్నుపోటు పొడిచిన పర్యవసానంగానే 1962లో యుద్ధం వచ్చిందని మనం ఎంతగా అనుకుంటున్నా అది మన పొరుగు దేశం. పైగా ఆర్ధికంగా మనకంటే చాలా ముందున్న దేశం. అలాంటి దేశాన్ని విస్మరించి మన ఆర్ధిక వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడం కుదరని పని. అందువల్ల సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఒక పక్క కృషి చేస్తూనే ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య బంధాలను విస్తరింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 2015నాటికి ఆ దేశంతో మన ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని ఒక అంచనా.
ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన చైనాకు ఫార్మా రంగంలోనూ, సేవా రంగంలోనూ ఎగుమతులు పెరిగితే... మౌలిక సదుపాయాల రంగంలోకి చైనా పెట్టుబడులనూ, సాంకేతికతనూ ఆహ్వానిస్తే అది మన ఆర్ధిక వ్యవస్థ బలపడటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న చైనాను తటస్థపరచడానికి కొంతలో కొంత ఉపయోగపడుతుంది.
సమూల ఆర్ధిక సంస్కరణలపై దృష్టిపెట్టాలని, 2020కల్లా లక్ష్యాలన్నిటినీ సాధించాలని నిరుడు జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దుకున్నా, విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆ దేశం వద్ద దండిగానే ఉన్నా ఇటీవలికాలంలో వృద్ధిరేటు మందగిస్తున్న తీరు దాన్ని ఆందోళనపరుస్తోంది. అందువల్లే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను మరింత సన్నిహితం చేసుకోవాలన్న తపన చైనాకు ఉంది. గతంలో బీజేపీ అగ్రనేత వాజపేయి విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడూ, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడూ చైనాతో మన సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి.
ఇప్పుడు నరేంద్రమోడీ నాయకత్వంలో అవి మరింత విస్తరించగలవనుకోవచ్చు. అంతమాత్రంచేత వాస్తవాధీన రేఖవద్ద మన దళాల మోహరింపు విషయంలో రాజీపడనవసరంలేదు. ఎన్నో ఏళ్లుగా సరైన గస్తీలేని ఆ ప్రాంతంలో అదనంగా 50,000 అదనపు దళాలను మోహరించాలని, పర్వతప్రాంతాల్లో శత్రువుతో తలపడగల ప్రత్యేక దళాలను ఏర్పాటుచేయాలని నిరుడు మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే, మన ప్రయోజనాల విషయంలో రాజీపడకుండానే చైనాతో చెలిమిని పటిష్టపరుచుకోవాలి. గత అనుభవాలరీత్యా ఇది తప్పనిసరి.
చైనాతో చెలిమి!
Published Sun, Jun 1 2014 12:14 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement