
చైనా దుందుడుకుతనం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో శిఖరాగ్ర సమావేశంలో తలమునకలైన వేళ మన సరిహద్దుల్లో చైనా హడావుడి సృష్టించింది. సిక్కిం వైపున్న సరిహద్దుల్లో తమ భూభాగంలో భారత జవాన్లు అడుగు పెట్టి అక్కడ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆరోపించింది. అయితే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) సైనికులే మన భూభాగంలోకి ప్రవేశించి రెండు బంకర్లను ధ్వంసం చేశారన్నది మన సైన్యం వాదన. సిక్కిం– భూటాన్–టిబెట్‌లు కలిసే ఈ ప్రాంతంలో... సరిగ్గా పశ్చిమబెంగాల్‌లోని సిలి గుడి కారిడార్‌కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఇరుపక్షాల దళాలూ ప్రస్తుతం మోహరించి ఉన్నాయి.
నిజానికిది పదిరోజులుగా నడుస్తున్న వివాదం. సమస్య తేలేవరకూ నాథూలావైపు నుంచి కైలాస మానససరోవర్ యాత్రీకులను వెళ్ల నివ్వబోమని చైనా చెబుతోంది. పర్యవసానంగా దాదాపు 350మంది యాత్రీకులు వెనక్కు రావాల్సివచ్చింది. భారత్–చైనాల మధ్య జమ్మూ–కశ్మీర్ నుంచి అరు ణాచల్‌ప్రదేశ్ వరకూ 3,488 కిలోమీటర్ల నిడివిలో సరిహద్దులుంటే అందులో సిక్కిం రాష్ట్రంలో 220 కిలోమీటర్ల మేర ఉంది. పీఎల్‌ఏ సైనికులు మన భూభా గంలోకి ప్రవేశించిన ఉదంతాలు జమ్మూ–కశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ లలో గతంలో చోటుచేసుకున్నాయి. కానీ సిక్కిం ప్రాంతం ఎప్పుడూ ప్రశాంతం గానే ఉంది.
ఇప్పుడు జరిగిన పరిణామాలను గమనిస్తే ఇకనుంచి అక్కడ కూడా సమస్యలు మొదలవుతాయని భావించాల్సివస్తుంది. చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్‌లో టిబెట్ మత గురువు దలైలామా ఇటీవల అడుగుపెట్టినప్పటినుంచీ చైనా కారాలు మిరియాలు నూరుతోంది. దలైలామాను అనుమతించడం రెండు దేశాల సంబంధాలనూ దెబ్బతీస్తుందని ఆ సందర్భంగా హెచ్చరించింది. దానికి కొనసాగింపుగా ప్రశాంతంగా ఉండే సిక్కింలో కూడా చైనా గిల్లికజ్జాలకు దిగిందా అన్న అనుమానం ఎవరికైనా రాకమానదు.
ఒక్క దలైలామా పర్యటనపై మాత్రమే కాదు... ఇటీవలికాలంలో దక్షిణ చైనా సముద్ర వివాదంతోసహా వివిధ అంశాల విషయంలో మన దేశం వైఖరి చైనాకు ససేమిరా నచ్చడం లేదు. అందుకే అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో ప్రవేశించకుండా మన దేశాన్ని అడ్డుకుంటోంది. ఇలాంటి వ్యతిరేకత ఉండబట్టే హిజ్‌బుల్ మొజాహిదీన్ నేత సయ్యద్ సలాహుద్దీన్‌ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపైనా, తమ భూభాగాన్ని ఉగ్రవాద స్థావ రంగా మారనీయరాదని పాకిస్తాన్‌కు చెప్పడంపైనా అది పరోక్షంగా వ్యాఖ్యానాలు చేసింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై సాగే పోరులో పాక్ అగ్రభాగాన ఉంటు న్నదని ప్రశంసించడం ద్వారా ఆ దేశంపై అమెరికా వ్యక్తం చేసిన అభిప్రాయాలు తప్పని చెప్పడానికి ప్రయత్నించింది.
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబై నగరంలో సాగించిన నరమేథం, పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జరిపిన దాడులు, అడపా దడపా కశ్మీర్‌లో జరిగే ఉగ్రవాద ఉదంతాలు తెలియ నంత అమాయకత్వంలో చైనా ఉన్నదని అనుకోనవసరం లేదు. ఉగ్రవాదంపై నిజంగా పాకిస్తాన్ పోరాడుతుంటే ముంబై, పఠాన్‌కోట ఉదంతాలకు బాధ్యులైన వారిని అప్పగించడంలో అది ఎందుకని జాప్యం చేస్తున్నదో చైనాయే చెప్పాలి. దాని తరఫున వకాల్తా తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలావాటికి చైనా సంజాయిషీ ఇవ్వాల్సివస్తుంది.
కైలాస్ మానససరోవర్ యాత్ర మొదటినుంచీ లిపులేఖ్ ప్రాంతం మీదుగా మాత్రమే జరిగేది. అయితే 2013లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదల తర్వాత ఆ తోవ బాగా దెబ్బతింది. ఇప్పుడు ఆ ప్రాంతంవైపు కూడా యాత్ర సాగుతున్నా అటు వైపునున్న ఎత్తయిన పర్వతాలు దాటుకుంటూ వెళ్లడం అంత సులభమేమీ కాదు. రెండేళ్లక్రితం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శిఖరాగ్ర చర్చల కోసం మన దేశం వచ్చినప్పుడు కైలాస్ మానససరోవర్ వెళ్లేందుకు నాథులా మార్గాన్ని కూడా తెరవడానికి ఆయన అంగీకరించారు. 2006లో తొలిసారి వాణిజ్య రాకపోకల కోసం దీన్ని ప్రారంభించారు. లిపులేఖ్‌తో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనది.
తక్కువ ఇబ్బందులతో కూడుకున్నది. నాథులా నుంచి కైలాస్ వరకూ ఉన్న దాదాపు 2,000 కిలోమీటర్ల దూరాన్ని మూడు రోజుల్లో చేరుకోవచ్చు. మెరుగైన రహదారి సౌకర్యంవల్లా, యాత్రీకులు సేదతీరడానికి చైనా కల్పించిన సౌకర్యాల వల్లా ఆ మార్గంలో యాత్రకు వెళ్లేందుకు ఎక్కువమంది మొగ్గుచూపుతారు. ఇరుగు పొరుగు దేశాలన్నాక వివాదాలు వస్తూ ఉంటాయి. కేవలం రెండేళ్లక్రితం తమ దేశాధినేత భారత్ సందర్శన సందర్భంగా ఆయన చొరవతో సాధ్యమైన నాథులావైపు యాత్రీకులను అనుమతించబోమని చెప్పడం వల్ల చైనా సాధిం చేదేమిటో తెలియదు. నిజానికి ఇరు దేశాల మధ్యా సరిహద్దు వివాదాలున్నా వాణిజ్య, సౌహార్ద సంబంధాలకు అవి అడ్డు రాలేదు. దేశాల మధ్య సంబం ధాలెలా ఉండాలో చెప్పడానికి చాలాచోట్ల దీన్ని ఉదాహరిస్తారు. చైనాయే అనేక సార్లు దీన్ని గొప్పగా చెప్పుకుంది. తీరా సమస్య వచ్చేసరికి అతిగా స్పందించి తన నైజాన్ని బయటపెట్టుకుంది.
క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ఏర్పడే సమస్యలపై ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం దుందుడుకు చర్య అవుతుంది. సరిహద్దు తగాదాలపై దూర దృష్టితో, విశాల దృక్పథంతో ఆలోచించి వ్యవహరించడమే వివేకం అనిపిం చుకుంటుంది. ఏదో విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాలను దృష్టిలో ఉంచు కుని మరేదో సాధిద్దామనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని చైనా తెలు సుకోవాలి. ఇటీవలికాలంలో సరిహద్దు ప్రాంతాల్లో వివిధచోట్ల చైనా చేపడుతున్న రహదారి నిర్మాణాలు మన దేశానికి కలవరం కలిగిస్తున్నాయన్నది వాస్తవం. ఆ నిర్మాణాల విషయంలో ముందుగానే అపోహలకు తావులేకుండా చూస్తే సమస్యలే రావు. కానీ చైనా తీరు మాత్రం అపోహల్ని మరింత పెంచడానికే దోహదపడుతోంది. నాథులా వద్ద యాత్రీకులను ఆపిన తీరు దీనికి అద్దం పడుతోంది.