చైనా, బెంగాల్‌ల మధ్య నలిగిపోతున్నాం: సిక్కిం సీఎం
ఓ వైపు చైనా, మరోవైపు బెంగాల్‌ల మధ్య సిక్కిం రాష్ట్రం నలిగిపోతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ అన్నారు. గత ముప్ఫై ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం వల్ల రాష్ట్రం రూ. 60 వేల కోట్లు నష్టపోయిందని పేర్కొన్నారు. చైనా, బెంగాల్‌ల మధ్య నలిగిపోవడానికి 1975లో సిక్కిం భారత భూభాగంలో ఐక్యం కాలేదని వ్యాఖ్యానించారు.
జాతీయ రహదారి 10 బెంగాల్‌లోని కల్లోల ప్రాంతాల గుండా సిక్కింలోకి ప్రయాణిస్తుంది. గత నెల 15వ తేదీ నుంచి కల్లోల ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. మరో వైపు నాథులా సరిహద్దులో చైనా, భారత్‌ల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో సిక్కిం ప్రజలు బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు.
సిలిగురి ప్రాంతం నుంచి వచ్చే పెట్రోల్ తదితర వస్తువులను అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నారు. దీంతో వీటిపై మాట్లాడిన చామ్లింగ్.. జాతీయ రహదారి 10 గత 30ఏళ్లుగా సిక్కిం రాష్ట్ర వీక్ పాయింట్‌గా మారిందని అన్నారు. గూర్ఖా ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ తమ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఉద్యమ కాలంలో ముఖ్యంగా పర్యాటక రంగం ఘోరం విఫలం చెందిందని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్‌లు పర్యాటకులు రాక వెలవెలబోయాయని చెప్పారు.