'ఇండియా ఓ చెడ్డ దేశం' అంటూ..
నిన్నటివరకు చైనా ప్రభుత్వమే భారత్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే, నేడు అక్కడి పత్రికలు సైతం విషాన్ని చిమ్మే పనికి పూనుకున్నాయి. ఆ దేశంలో ప్రముఖ పత్రిక అయిన 'గ్లోబల్ టైమ్స్' మంగళవారం తన సంపాదకీయంలో భారత్ ను తీవ్రస్థాయిలో తిట్టిపోసింది. ఇండియా ఓ చెడిపోయిన దేశమని, అంతర్జాతీయ వ్యవహారాల్లో జిత్తులమారిలా వ్యవహరిస్తుందని, ఇండియన్స్ పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసంరం ఉందని పిచ్చిరాతలు రాసింది. అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్ జీ)లో భారత్ చేరకుండా చైనా అడ్డుకోవడాన్ని నిస్సిగ్గుగా సమర్థించింది.
చైనాలో చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో ప్రచురితం అవుతోన్న పత్రికల్లో ప్రముఖమైనది 'గ్లోబల్ టైమ్స్' పత్రిక. అన్ని మీడియా సంస్థల మాదిరే గ్లోబల్ టైమ్స్ కూడా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుచుకుంటుంది. ఆ పత్రిక మంగళవారం నాటి సంపాదకీయం(ఎడిటోరియల్) ఆసాంతం భారత్ పై అక్షరదాడి మాదిరి సాగింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీ టీ)పై సంతకం చేయకుండా భారత్ ఎన్ఎస్ జీలో సభ్యురాలు కావాలనుకోవడం అనైతికమని, అందుకే తమ నైతిక బాధ్యతగా చైనా, ఇతర దేశాలు భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడాయని 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇండియా నంగనాచిలా వ్యవహరించిందంటూ ఎగతాళి చేసింది.
భారత్ తోపాటు అమెరికాపైనా 'గ్లోబల్ టైమ్స్' రంకెలేసింది. ప్రపంచ మంటే ఒక్క అమెరికానే కాదని, అది వెనకేసుకొచ్చినంత మాత్రాన మిగతా ప్రపంచమంతా ఇండియాను నిర్ద్వంద్వంగా సమర్థింస్తుందనుకోవడం సబబు కాదని రాసుకొచ్చింది. మార్కెట్ అవకాశాల కోసంమే పశ్చిమ దేశాలు ఆసియా దేశాలతో స్నేహాన్ని నటిస్తున్నాయని అంది. ఇక భారత జాతీయవాదులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది 'గ్లోబల్ టైమ్స'. భారత జాతీయవాదుల్లో కొందరు స్వార్థపరులని, స్వలాభం కోసమే ఆలోచిస్తారని ఆరోపించింది. భారతీయులు పద్ధతి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని దూషించింది. తప్పులను ఎత్తిచూపిన దేశాలపై రాళ్లెయ్యటం సరికాదని పేర్కొంది. చైనా పత్రిక విషపూరిత రాతలపై భారత అధికారులు ఇంకా స్పందించాల్సిఉంది.