న్యూఢిల్లీ: శ్రీలంక, మాల్దీవులకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పొరుగుదేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటగా మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు శుక్రవారం బయలుదేరిన సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘నా మాల్దీవులు, శ్రీలంక పర్యటనల ద్వారా ఇరుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతున్నా.
ఈ ప్రాంత భద్రత, అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేస్తాం’ అని మోదీ తెలిపారు. శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రమూకల బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళులు అర్పించేందుకే తాను శ్రీలంకకు వెళుతున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ‘ఈస్టర్ ఉగ్రదాడులతో తీవ్రంగా కలత చెందిన శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై పోరాటంలో శ్రీలంకకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తాం’ అని వెల్లడించారు.
ఉగ్రదాడుల తర్వాత శ్రీలంకను సందర్శిస్తున్న తొలి విదేశీ అధినేత మోదీయే కావడం గమనార్హం. కాగా, మాల్దీవుల పర్యటనలో భాగంగా మోదీ తీరప్రాంత రాడార్ నిఘా వ్యవస్థతో పాటు మాల్దీవుల జాతీయ రక్షణ దళం(ఎంఎన్‌డీఎఫ్) శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ పర్యటనలోనే మాల్దీవుల ప్రభుత్వం మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ నిషానిజ్జుద్దీన్’ను ప్రకటించే అవకాశముందని వెల్లడించాయి. అనంతరం ఆదివారం శ్రీలంకలకు చేరుకోనున్న మోదీ.. ఆ దేశపు అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నాయి.
12న మంత్రిమండలి భేటీ..
సార్వత్రిక ఎన్నికల అనంతరం 57 మందితో ఏర్పాటైన కేంద్ర మంత్రిమండలి తొలి సమావేశం జూన్ 12న జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో చేపట్టాల్సిన సంస్కరణలు, పథకాలు, ఇతర ముఖ్య నిర్ణయాలపై చర్చిస్తారని వెల్లడించాయి. అదే రోజున కేంద్ర కేబినెట్ కూడా సమావేశమవుతుందని పేర్కొన్నాయి.
సిన్హా పదవీకాలం మూడోసారి పొడిగింపు
కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. సిన్హా పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. కాగా తాజా పొడిగింపుతో గత ఏడు దశాబ్దాల్లో కేబినెట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన అధికారిగా సిన్హా గుర్తింపు పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment