న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీని కించపరిచేలా పార్లమెంట్‌లో బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ సైతం బిధురి అనుచిత వ్యాఖ్యలపై అసంతృప్తి, ఆగ్రహం చేశారు. మరోసారి ఇలాంటి ప్రవర్తన పునరావృతం అయితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అభ్యంతరకర వ్యాఖ్యలు
చంద్రయాన్-3 మిషన్ విజయంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో బిధురి మాట్లాడుతూ.. అమ్రోహా బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిధూరి.. మైనార్టీ ఎంపీని ఉగ్రవాదిగా పేర్కొంటూ పదేపదే దూషణలు చేశారు. డానిష్ అలీని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుండగా.. పార్టీ సహచరుడు, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ నవ్వుతూ కనిపించారు.
ఇలాంటి మాటలు పడటం బాధగా ఉంది
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై డానిష్ అలీ స్పీకర్‌కు లేఖ రాశారు. కొత్త పార్లమెంటు భవనం సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. మీ నాయకత్వంలో మైనారిటీ ఎంపీగా నాకు ఇలాంటి మాటలు పడడం చాలా బాధగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయనతోపాటు అధికార పార్టీ తీరుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిధురిపై ఎంపీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఎంపీ తరపున క్షమాపణలు
ఈ వివాదం అదుపు తప్పుతోందని గమనించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. బీజేపీ ఎంపీ తరపున క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల విపక్షాలు బాధపడితే చింతిస్తున్నానమని అన్నారు. మరోవైపు స్పీకర్ కూడా బీజేపీ ఎంపీని హెచ్చరించారు. తన భాష, గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. మరోసారి ఇలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బిధూరి ఉపయోగించిన పదాలను తీవ్రంగా పరిగణిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
సస్పెండ్‌కు డిమాండ్
అయితే క్షమాపణలు సరిపోదని, బిధురిని సస్పెండ్ చేయాలని లేదా అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది పూర్తిగా అవమానకరమని.. రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు ఆమోదయోగ్యం కాదని, ఇది పార్లమెంటును అవమానించడమేనని పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగం క్షమించరానిది
బిధూరిపై చర్యలు తీసుకోకుండా ‘మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అనడం సిగ్గుచేటని లోక్‌సభ స్పీకర్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రతిపక్ష ఎంపీలు చేసిన చిన్న తప్పులకే సస్పెండ్ చేస్తారని.. తమ పార్టీ ఎంపీలు తప్పు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దుర్వినియోగం చేయడం క్షమించరానిదని అన్నారు.
ఇదే బీజేపీ సంస్కృతి
కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందిస్తూ.. బింధూరి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి భాష ఎప్పుడూ వినలేదని, పార్లమెంట్ లోపలా, బయటా ఇది వాడకూడదని తెలిపారు. ఇది కేవలం డానిష్ అలీనే కాకుండా తామందరిని అవమానించేలా ఉన్నాయన్నారు. కొత్త పార్లమెంటుకు బిధురీమాటలతోనే నాంది జరిగిందని.. ఇది బీజేపీ ఉద్దేశాలను తెలియజేస్తోందని విమర్శించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పడం కంటే బింధూరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బిధూరిపై చర్యలు తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ముస్లింలు, ఓబీసీలను వేధించడం బీజేపీ సంస్కృతిలో అంతర్భాగమని ఆమె ఆరోపించారు.
చదవండి: ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment