దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్‌జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్‌లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్‌ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్‌ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఓ వర్గాన్ని ఎన్‌ఐఏ టార్గెట్‌గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్‌ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్‌ఐఏ అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment