సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని, దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆత్మీయత, స్నేహభావాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రంజాన్ మాసంలో మీరంతా సంతోషంగా ఉండాలి, మీ అందరి ప్రార్థనలు ఫలించాలి, మీకు అంతా శుభం కలగాలి’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని మైనార్టీలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు.
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం అత్యధిక నిధులిచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని.. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ముస్లిం మైనార్టీలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మైనార్టీలకు తీవ్ర ద్రోహం చేసిందని, ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చి మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని అంజాద్ బాషా గుర్తుచేశారు. పలువురు ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలన ముస్లింలకు స్వర్ణయుగమని, మరో మూడు పర్యాయాలు వైఎస్ జగన్ సీఎంగా ఉండేలా అల్లాను ప్రార్థించాలన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
టోపీ, కండువా ధరించి సీఎం నమాజ్
ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన సీఎం వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు హాఫీజ్‌ఖాన్, ముస్తఫా, నవాజ్ బాషా, వెలంపల్లి శ్రీనివాస్, కె. రక్షణనిధి, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత, ప్రభుత్వ సలహాదారులు హబీబుల్లా, ఎస్‌ఎం జియాఉద్దీన్, అలీ, వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ విభాగం చైర్మన్ వి.ఖాదర్‌బాషా, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికారాము తదితరులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment